Leading News Portal in Telugu

Hasan Ali-IPL: ఐపీఎల్ ఆడాలనేది నా కోరిక: పాక్ పేసర్


Hasan Ali-IPL: ఐపీఎల్ ఆడాలనేది నా కోరిక: పాక్ పేసర్

Pakistan pacer Hasan Ali wishes to play in IPL: ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ లీగ్ ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్‌’ (ఐపీఎల్). ప్రపంచ క్రికెట్‌లో ఐపీఎల్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లు కుమ్మరించే ఈ లీగ్‌లో ఆడాలని ప్రతి క్రికెటర్ కలలు కంటాడు. ఐపీఎల్‌లో ఒక్కసారైనా ఆడితే చాలనుకునే ఎందరో విదేశీ స్టార్ క్రికెటర్స్ కూడా ఉన్నారు. లీగ్‌లో భాగమయ్యేందుకు అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు సైతం తమ దేశానికి ఆడే మ్యాచులను సైతం వదిలేస్తున్నారంటే.. ఐపీఎల్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో లీగ్‌లు జరుగుతున్నా.. అందులో ఐపీఎల్ చాలా ప్రత్యేకం.

ఒక్క పాకిస్థాన్ మినహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల క్రీడాకారులు ఐపీఎల్‌లో ఆడుతారు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా.. పాక్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడకుండా బీసీసీఐ నిషేధించింది. దాంతో పాల్ ప్లేయర్స్ ఐపీఎల్ ఆడడం లేదు. అయితే ఐపీఎల్‌లో ఆడేందుకు పాక్ ప్లేయర్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఐపీఎల్ ఆడాలనే తన కోరికను పాకిస్థాన్ పేసర్ హసన్ అలీ తాజాగా బయటపెట్టాడు. ఐపీఎల్ ఓ బ్రాండ్ అని, అవకాశం వస్తే కచ్చితంగా ఐపీఎల్‌లో ఆడుతా అని పేర్కొన్నాడు.

‘ఐపీఎల్ ప్రపంచంలోనే అతి పెద్ద లీగ్. ఐపీఎల్‌లో ఆడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఆటగాడు ఆసక్తి చూపుతాడు. నాకు కూడా ఐపీఎల్ ఆడాలని ఉంది. అవకాశం వస్తే భవిష్యత్‌లో కచ్చితంగా ఆడతా’ అని ఓ పాకిస్తాన్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో పాక్ ఆటగాళ్లు ఆడారు. షాహిద్ అఫ్రిదీ, షోయబ్ మాలిక్, షోయబ్ అక్తర్, సోహైల్ తన్వీర్ లాంటి ప్లేయర్స్ మొదటి సీజన్‌లో ఆడారు. ముంబైలో పాక్ ఉగ్రవాదుల దాడి అనంతరం పాక్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడకుండా బీసీసీఐ బ్యాన్ చేసింది.