Leading News Portal in Telugu

IND vs AUS: ఇషాన్‌ కిషన్‌ తప్పిదమే ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది!



Ishan Kishan Mistake

Ishan Kishan’s Mistake helped Australia: గువాహటి వేదికగా మంగళవారం జరిగిన మూడో టీ20లో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. కచ్చితంగా గెలుస్తుందనుకున్న భారత్.. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ విధ్వంసంతో చివరి బంతికి ఓడాల్సి వచ్చింది. ఇటీవలే ముగిసిన ప్రపంచకప్‌లో అఫ్గాన్‌పై డబుల్‌ సెంచరీని గుర్తుకు తెచ్చేలా మూడో టీ20లో మ్యాక్స్‌వెల్‌ అజేయ శతకంతో విరుచుకుపడ్డాడు. చివరి రెండు ఓవర్లలో బౌండరీలు, సిక్సులు బాది ఊహించని విజయాన్ని ఆస్ట్రేలియాకు అందించాడు. అయితే వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ చేసిన ఓ తప్పిదం ఆసీస్‌కు కలిసొచ్చింది.

ఆస్ట్రేలియా 9 బంతుల్లో 33 పరుగులు చేయాల్సి ఉంది. అక్షర్‌ పటేల్‌ వేసిన 19వ ఓవర్ నాలుగో బంతిని మాథ్యూ వేడ్‌ ముందుకు వచ్చి ఆడబోయాడు. బంతిని అందుకున్న ఇషాన్‌ కిషన్ స్టంపింగ్‌ చేసి అప్పీల్‌ చేశాడు. రిప్లేలో వేడ్‌ నాటౌట్‌గా తేలాడు. అయితే బంతిని అందుకునే క్రమంలో ఇషాన్‌ గ్లోవ్స్‌.. స్టంప్స్‌ కన్నా ముందుకు రావడంతో అంపైర్‌ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించాడు. ఫ్రీహిట్‌ను సద్వినియోగం చేసుకున్న వేడ్‌.. భారీ సిక్స్‌ కొట్టాడు. అదే ఓవర్‌ ఆఖరి బంతికి బైస్‌ రూపంలో నాలుగు పరుగులు వచ్చాయి.

Also Read: AP Rains: ఆంధ్ర రాష్ట్రానికి తుపాను ముప్పు.. డిసెంబరు తొలి వారంలో భారీ వర్షాలు!

ఇక ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆస్ట్రేలియా విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ బౌండరీల మోత మోగించాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. బౌలర్‌ బంతి వేసిన తర్వాత వికెట్‌ కీపర్‌ స్టంప్స్‌ వెనకాలే బంతిని అందుకోవాలి. గ్లవ్‌లో కొంచెం భాగం ముందుకు వచ్చినా.. దాన్ని అంపైర్‌ నోబాల్‌గా ప్రకటిస్తాడు. ఇషాన్ కిషన్ స్టంపింగ్‌ కోసం అప్పీల్‌ చేయకపోతే.. ఆస్ట్రేలియాకు ఫ్రీహిట్‌ అవకాశం వచ్చేదే కాదు. అప్పుడు మాథ్యూ వేడ్‌కు సిక్స్ బాదే అవకాశం లేకుండా ఉండేది. కిషన్‌ తప్పిదమే ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది.