Leading News Portal in Telugu

Arshdeep Singh: నా వల్లే భారత జట్టు ఓడిపోతుందని భయపడ్డా: అర్ష్‌దీప్


Arshdeep Singh: నా వల్లే భారత జట్టు ఓడిపోతుందని భయపడ్డా: అర్ష్‌దీప్

Arshdeep Singh React on IND vs AUS Last Over: ఆస్ట్రేలియాతో జరిగిన 5 టీ20ల సిరీస్‌‌ను భారత్ కైవసం చేసుకుంది. పొట్టి సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఐదవ టీ20 మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి 10 పరుగులు అవసరమవ్వగా.. యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మాథ్యూ వేడ్‌ను ఔట్ చేయడంతో పాటు కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చిన అర్ష్‌దీప్.. తన వల్లే టీమిండియా ఓడిపోతుందని భయపడ్డాడ్డాడట. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం అతడే స్వయంగా తెలిపాడు.

ఐదవ టీ20 మ్యాచ్‌లో తొలి మూడు ఓవర్లలో భారీగా పరుగులివ్వడంతో.. భారత జట్టు ఓటమికి తాను కారణం అవుతానని ఆందోళనకు గురయ్యానని అర్ష్‌దీప్ సింగ్ చెప్పాడు. అయితే చివరి ఓవర్ రూపంలో తనకు మరో అవకాశం దక్కిందని, భారత విజయంలో కీలక పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉందన్నాడు. ‘ఈ మ్యాచ్‌లో మొదటి మూడు ఓవర్లు ధారళంగా పరుగులివ్వడంతో నా వల్లే జట్టు ఓడిపోతుందని ఆందోళనకు గురయ్యా. కానీ ఆ దేవుడు చివరి ఓవర్ రూపంలో నాకు ఇంకో అవకాశం ఇచ్చాడు. ఆ దేవుడికి కృతజ్ఞతలు. నాపై నమ్మకం ఉంచిన కెప్టెన్ సూర్యకుమార్, సపోర్ట్ స్టాప్‌కు ధన్యవాదాలు’ అని అర్ష్‌దీప్ తెలిపాడు.

‘చివరి బౌలింగ్ చేస్తున్నప్పుడు నా మదిలో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు లేవు. సూర్య భాయ్ నా వద్దకు వచ్చి ఒక్కటే చెప్పాడు. ఏమి జరిగినా నిర్భయంగా బౌలింగ్ చేయమన్నాడు. ఈ విజయం క్రెడిట్ మా బ్యాటర్లదే. బ్యాటింగ్‌కు కఠినంగా ఉన్న పిచ్‌పై పోరాడే లక్ష్యాన్ని అందించారు. ఈ సిరీస్‌లో నా వ్యక్తిగత ప్రదర్శన బాగా లేదు. నా బౌలింగ్ తీరును సమీక్షించుకుని భవిష్యత్తులో మెరుగ్గా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సిరీస్ నాకు ఓ గుణపాఠం. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటా’ అని అర్ష్‌దీప్ సింగ్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్.. 2 వికెట్లు తీసి 40 పరుగులిచ్చాడు. తొలి మూడు ఓవర్లలోనే ఏకంగా 36 పరుగులు ఇచ్చాడు.