Leading News Portal in Telugu

Virat Kohli-Anushka Sharma: విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల బంధానికి ఆరేళ్లు!


Virat Kohli-Anushka Sharma: విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల బంధానికి ఆరేళ్లు!

Virat Kohli-Anushka Sharma’s 6th Anniversary: చాలా మంది సెలబ్రిటీల మాదిరే.. టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మల ప్రేమ బంధం కూడా మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందంటూ సోషల్ మీడియాలో ఎన్నో వదంతులు వచ్చాయి. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ.. తమ ప్రేమ బంధాన్ని విరుష్క జోడి పెళ్లి పీటలు వరకు తీసుకెళ్లారు. కోహ్లీ-అనుష్కలు వివాహబంధంతో ఒక్కటై నేటికి ఆరేళ్లు పూర్తయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో విరుష్క (#virushka) ట్రెండింగ్‌లోకి వచ్చింది.

2013లో ఓ షాంపు యాడ్‌ కోసం చేసిన చిత్రీకరణలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు మొదటిసారి కలుసుకున్నారు. ఇద్దరు చిత్రీకరణలో స్నేహితులుగా మారారు. ఆ తర్వాత వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. విరుష్క జోడి కొన్నేళ్లు ప్రేమాయణం సాగించారు. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించడంతో.. 2017 డిసెంబర్‌ 11న ఇటలీలో అతికొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వీరి ప్రేమబంధానికి గుర్తింపుగా ‘వామిక’ అనే కూతురు ఉంది. ప్రస్తుతం అనుష్క గర్భవతి.

వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ అనంతరం విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ ద్వారా తిరిగి భారత జట్టులోకి అడుగుపెట్టనున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్, ఆపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో కోహ్లీ ఆడనున్నాడు. ప్రపంచకప్ 2023లో విరాట్ పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. మరోవైపు పెళ్లి అనంతరం అనుష్క శర్మ సినిమాలకు దూరంగా ఉంటూ.. కుటుంబంతో గడుపుతున్నారు.