All Eyes on Travis Head and Rachin Ravindra at IPL Auction 202: 4ఐపీఎల్ 2024 కోసం ఆటగాళ్ల వేలానికి సర్వం సిద్ధమైంది. డిసెంబర్ 19న దుబాయ్‌లో జరిగే వేలంలో మొత్తం 333 మంది ఆటగాళ్లు అమ్మకానికి ఉన్నారు. ఐపీఎల్ 2024 వేలం కోసం మొత్తం 1166 మంది ఆటగాళ్లు నమోదు చేసుకుకోగా.. ఫ్రాంచైజీలతో సంప్రదించాక ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ 333 మందితో తుది జాబితాను ప్రకటించింది. ఇందులో 214 మంది భారతీయులు ఉండగా.. 119 మంది విదేశీయులు, ఇద్దరు అసోసియేట్ దేశాల నుంచి ఉన్నారు. 333 మంది ఆటగాళ్లలో కొందరిపై కాసుల వర్షం కురవనుంది.
వన్డే వరల్డ్‌కప్ 2023లో ఆస్ట్రేలియాను విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ ట్రావిస్ హెడ్‌పై ఫ్రాంచైజీలన్నీ కన్నేశాయి. అతడికి ఐపీఎల్ 2024 వేలంలో భారీ మొత్తం దక్కే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా 10 కోట్లకు పైనే హెడ్ అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు వన్డే ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్ తరఫున మెరిసిన రచిన్ రవీంద్రను కొనడానికి కూడా ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశాలు ఉన్నాయి. ఆల్‌రౌండర్ కావడం రవీంద్రకు కలిసొచ్చే అంశం. అంతేకాదు ఓపెనింగ్ చేయడం, హిట్టింగ్ చేయడం కూడా అతడికి కలిసొచ్చే అంశాలు.
ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్యాట్ కమిన్స్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ స్టార్క్‌లకు మంచి డిమాండ్ ఉండనుంది. వీళ్ల కనీస ధర రూ. 2 కోట్లు. రచిన్ రవీంద్ర కనీస ధర రూ.50 లక్షలు. ఐపీఎల్ 2024 వేలంలో ఖర్చు పెట్టడానికి ఫ్రాంఛైజీల వద్ద మొత్తం రూ. 262.95 కోట్లు ఉన్నాయి. ఈ వేలంలో మొత్తం 77 మందిని ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయనున్నారు. ఇందులో గరిష్టంగా 30 మంది విదేశీ క్రికెటర్లను జట్లు కొనుక్కోవచ్చు. భారత ప్లేయర్స్ హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ కనీస ధర రూ. 2 కోట్లు.