Leading News Portal in Telugu

Raj Limbani: 7 వికెట్లతో చెలరేగిన రాజ్‌ లింబాని.. ఆసియాకప్‌ 2023 సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్‌!


Raj Limbani: 7 వికెట్లతో చెలరేగిన రాజ్‌ లింబాని.. ఆసియాకప్‌ 2023 సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్‌!

India beat Nepal to enter U19 Asia Cup 2023 Semifinal: పేసర్‌ రాజ్‌ లింబాని (7/13) చెలరేగడంతో అండర్‌-19 ఆసియా కప్‌ 2023లో భారత యువ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూపు-ఏలో భాగంగా మంగళవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్రూపు దశలో మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో నెగ్గిన భారత్‌ నాలుగు పాయింట్లతో సెమీస్‌ బెర్తు దక్కించుకుంది. ఆరంభ మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను చిత్తుచేసిన భారత్.. పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది.

దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నేపాల్‌.. రాజ్‌ లింబాని ధాటికి 22.1 ఓవర్లలో 52 పరుగులకే ఆలౌట్ అయింది. నిప్పులు చెరిగే బంతులతో నేపాల్‌ బ్యాటర్లను ఓ ఆటాడుకున్నాడు. రాజ్‌ బౌలింగ్ దాడికి నేపాల్‌ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. నేపాల్‌ జట్టులో ఒక్క బ్యాటర్‌ కూడా రెండంకెల స్కోరు అందుకోలేకపోయారు. భారత బౌలర్లు ఇచ్చిన అదనపు పరుగులే (13) అత్యధిక స్కోరు కావడం గమనార్హం. రాజ్‌ 9.1 ఓవర్లలో 3 మెయిడెన్లు వేసి.. 13 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు. ఆరాధ్య శుక్లా (2/31), అర్షిన్‌ కులకర్ణి (1/7) కూడా రాణించారు.

అనంతరం భారత్‌ 7.1 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 57 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు ఆదర్శ్‌ సింగ్‌ (13 నాటౌట్‌; 13 బంతుల్లో 2×4), అర్షిన్‌ కులకర్ణి (43 నాటౌట్‌; 30 బంతుల్లో 1×4, 5×6) దంచేశారు. ఈ ఇద్దరు మొదటి వికెట్‌కు 57 పరుగులు జోడించి లక్ష్యాన్ని ఛేదించారు. ఇక పాకిస్తాన్‌ మంగళవారం అఫ్గనిస్తాన్‌ను 83 పరుగుల తేడాతో మట్టికరిపించి మూడో విజయం నమోదు చేసింది. దాంతో ఆడిన మూడు మ్యాచ్‌లను నెగ్గి గ్రూప్‌-ఏ టాపర్‌గా నిలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది.