Leading News Portal in Telugu

Rinku Singh: క్షమాపణలు చెప్పిన రింకూ సింగ్‌.. వీడియో వైరల్‌!


Rinku Singh: క్షమాపణలు చెప్పిన రింకూ సింగ్‌.. వీడియో వైరల్‌!

Rinku Singh said sorry after the IND vs SA 2nd T20I: యువ బ్యాటర్‌ రింకూ సింగ్‌ భారత్ తరఫున టీ20లలో అదరగొడుతున్నాడు. ప్రతి మ్యాచ్‌లో బౌండరీలు బాదుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీ20 సిరీస్‌లో సత్తాచాటిన రింకూ.. తాజాగా దక్షిణాఫ్రికా గడ్డ మీద కూడా మెరుస్తున్నాడు. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో రింకూ మెరుపు ఇనింగ్స్ ఆడాడు. 39 బంతుల్లోనే 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. రింకూ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

అయితే ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్‌ బాదిన ఓ సిక్సర్‌ కారణంగా మీడియా గ్లాస్‌ బాక్స్‌ బద్దలైంది. ఇడెన్ మార్క్‌రమ్ వేసిన 19వ ఓవర్‌ చివరి బంతిని రింకూ స్ట్రైట్‌గా ఆడగా.. సైట్ స్క్రీన్‌పై ఉన్న మీడియా బాక్స్ గ్లాస్‌ను బలంగా తాకింది. దాంతో అది ముక్కలైంది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఈ విషయం గురించి మ్యాచ్‌ అనంతరం స్పందించిన రింకూ.. స్టేడియం నిర్వాహకులకు క్షమాపణలు చెప్పాడు. బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో రింకూ మాట్లాడాడు.

‘ఆ బంతిని సిక్సర్‌గా మలచాలని మాత్రమే భావించా. నా షాట్‌ కారణంగా మీడియా గ్లాస్‌ బాక్స్‌ పగిలిపోయిందని నాకు తెలియదు. ఆ విషయం గురించి నా సహచరులు చెప్పారు. గ్లాస్‌ బ్రేక్‌ చేసినందుకు స్టేడియం నిర్వాహకులకు క్షమాపణలు చెబుతున్నా’ అని రింకూ సింగ్‌ పేర్కొన్నాడు. ‘పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చా. ఆ సమయంలో సూర్యకుమార్ యాదవ్ గైడ్ చేశాడు. వికెట్ల గురించి ఆలోచించకుండా.. నీ ఆట ఆడమని చెప్పాడు. క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకున్నా. తర్వాత షాట్స్ ఆడాను’ అని రింకూ చెప్పాడు.