Leading News Portal in Telugu

Suryakumar Yadav: అందుకే ఓడిపోయాం: సూర్యకుమార్‌


Suryakumar Yadav: అందుకే ఓడిపోయాం: సూర్యకుమార్‌

Captain Suryakumar Yadav React on India Defeat against South Africa: దక్షిణాఫ్రికా అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిందని, మంచి లక్ష్యాన్ని తాము కాపాడుకోలేకపోయామని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్ చెప్పాడు. ఈ ఓటమి నుంచి అందరం నేర్చుకుంటామని, మూడో టీ20పై ఫోకస్ పెడుతామన్నాడు. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భరత్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ మాట్లాడుతూ ఓటమికి గల కారణాలు వెల్లడించాడు.

‘సగం ఇన్నింగ్స్‌ పూర్తయ్యే వరకు మేము మెరుగైన స్కోరే చేశామని భావించాం. అయితే దక్షిణాఫ్రికా బ్యాటర్లు మాకంటే అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. మొదటి 5-6 ఓవర్లలోనే బాగా బ్యాటింగ్ చేసి ఆటను మా నుండి దూరం చేశారు. ఇది బ్రాండ్ ఆఫ్ క్రికెట్. దీనిపై చేర్చికుకోవాల్సిన అవసరం ఉంది. వికెట్‌ పచ్చిగా ఉండటంతో ఆరంభంలో బ్యాటింగ్‌ చేయడం కష్టంగా మారింది. భవిష్యత్‌ మ్యాచ్‌లలోనూ ఇలాంటి కఠిన పరిస్థితులే ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ మాకు ఓ గుణపాఠం. ఇక మూడో టీ20 మ్యాచ్‌పై మా ఫోకస్ పెడతాం’ అని సూర్యకుమార్‌ యాదవ్ తెలిపాడు.

దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20లలో భారత్ తలపడిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను యువ భారత్ 4-1 తేడాతో సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా సిరీస్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోని మొదటి మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోగా.. రెండో టీ20లో ప్రొటీస్ గెలిచింది. మూడో టీ20 గురువారం జోహన్నెస్‌బర్గ్ లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో రాత్రి 8.30కు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్ చూస్తోంది.