Leading News Portal in Telugu

AUS vs PAK: టెస్టులో టీ20 ఇన్నింగ్స్‌.. డేవిడ్ వార్నర్‌ సెంచరీ!


AUS vs PAK: టెస్టులో టీ20 ఇన్నింగ్స్‌.. డేవిడ్ వార్నర్‌ సెంచరీ!

David Warner Hits Century in AUS vs PAK 1st Test: ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫార్మాట్ ఏదైనా దూకుడుగా ఆడేస్తుంటాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బౌండరీలు, సిక్సులు బాదుతూ.. బౌలర్లపై ఒత్తిడి తెస్తాడు. టెస్ట్ మ్యాచ్ అయినా సరే ఒక్కోసారి టీ20 ఇన్నింగ్స్‌ ఆడేస్తాడు. పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీ20 ఇన్నింగ్స్‌ ఆడాడు. 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొదటి సెషన్ మొత్తం వార్నర్ దూకుడుగా ఆడాడు. 67 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 72 పరుగులు చేశాడు.

అయితే లంచ్ అనంతరం డేవిడ్ వార్నర్‌ దూకుడు తగ్గించాడు. ఆచితూచి ఆడుతూ చెత్త బంతులను మాత్రమే బౌండరీలు తరలిస్తున్నాడు. రెండో సెషన్‌లో ఎక్కువగా సింగిల్స్ తీస్తున్నాడు. ఈ క్రమంలో 125 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. పాక్‌ అరంగేట్ర పేసర్‌ ఆమిర్‌ జమాల్‌ వేసిన 43వ ఓవర్ ఐదవ బంతికి ఫోర్ బాది మూడంకెల స్కోర్ అందుకున్నాడు. టెస్టులో అతడికి ఇది 26వ శతకం.

డేవిడ్ వార్నర్ కొట్టిన సిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. షాహిన్ ఆఫ్రిది వేసిన బంతిని వార్నర్ వెనకాలకు కొట్టి కిందపడిపోయాడు. ఆస్ట్రేలియా 48 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 205 రన్స్ చేసింది. డేవిడ్ వార్నర్‌ (109), స్టీవ్ స్మిత్ (18) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఉస్మాన్‌ ఖవాజా (41), మార్నస్ లాబుషేన్ (16) రన్స్ చేశారు. ఆస్ట్రేలియాలో పాకిస్తాన్‌కు టెస్టుల్లో చెత్త రికార్డు ఉంది. 1995లో కంగారూ గడ్డపై చివరిసారిగా టెస్టు మ్యాచ్‌ నెగ్గిన పాక్‌.. ఇంతవరకు కూడా సిరీస్‌ గెలవలేదు.