Leading News Portal in Telugu

Suryakumar Yadav: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్!


Suryakumar Yadav: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్!

Suryakumar Yadav Breaks Virat Kohli Record: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో సూర్య ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో 8 సిక్స్‌లు బాదిన సూర్య.. టీ20ల్లో టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.

టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన రెండో భారత బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. సూర్య 57 ఇన్నింగ్స్‌ల్లో 123 సిక్స్‌లు బాదాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాప్‌లో ఉన్నాడు. రోహిత్ 140 ఇన్నింగ్స్‌ల్లో 182 సిక్స్‌లు కొట్టాడు. విరాట్ కోహ్లీ 107 ఇన్నింగ్స్‌ల్లో 117 సిక్స్‌లు బాది మూడో స్థానంలో ఉన్నాడు. మూడో టీ20కి ముందు విరాట్ రికార్డును బద్దలు కొట్టడానికి సూర్యకు మూడు సిక్సర్లు అవసరం కాగా.. ఏకంగా 8 సిక్స్‌లు బాదాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్ రోహితే. మార్టిన్ గుప్తిల్ (173) మినహా ఎవరూ కూడా రోహిత్ దరిదాపుల్లో లేరు.

టీ20ల్లో కెప్టెన్‌గా సెంచరీ బాదిన రెండో భారత సారథిగా కూడా సూర్యకుమార్ యాదవ్ రికార్డుల్లో నిలిచాడు. రోహిత్ శర్మ రెండు సార్లు కెప్టెన్‌గా శతకాలు నమోదు చేశాడు. ఇక టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో సూర్య (4) మూడో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ (4), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (4) సూర్య కంటే ముందున్నారు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా నాలుగు సెంచరీలు బాదిన బ్యాటర్‌గా సూర్య రికార్డుల్లోకెక్కాడు.