
Smriti Mandhana Says These Two qualities which I will look in a man: ఓ వ్యక్తి తనకు నచ్చాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చెప్పారు. తనను జాగ్రత్తగా చూసుకోవాలని, క్రికెట్‌ను బాగా అర్థం చేసుకుంటే చాలన్నారు. పరోక్షంగా తన జీవిత భాగస్వామిని ఉద్దేశిస్తూ స్మృతి ఈ వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో తాజాగా స్మృతి పాల్గొన్నారు. ఈ షోలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు.
‘స్మృతి మేడమ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు చాలా మంది అబ్బాయిలే ఫాలోవర్లుగా ఉన్నారు. ఓ వ్యక్తిలో మీకు నచ్చే లక్షణాలు ఏమిటి?’ అని ఒక అభిమాని ప్రశ్నించాడు. ‘ఓసారి అటు తిరగండి సార్’ అని అమితాబ్‌ని ఇదే షోలో పాల్గొన్న ఇషాన్ కిషన్ చమత్కరించాడు. ఆ వెంటనే అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ.. ‘నీకు పెళ్లైందా’ అని అడిగాడు. అందుకు ఆ అభిమాని ‘లేదు సర్.. అందుకే ఈ ప్రశ్న అడిగా’ అని అన్నాడు. దాంతో షోలో నవ్వులు పూసాయి.
అభిమాని ప్రశ్నకు స్మృతి మంధాన జవాబిస్తూ… ‘ఇలాంటి ప్రశ్నను నేను అస్సలు ఊహించలేదు. మంచి అబ్బాయి అయి ఉండాలి. ఇది చాలా ముఖ్యం. నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి, నా ఆటను బాగా అర్థం చేసుకోవాలి. ఈ రెండు లక్షణాలు ఉండాలి. ఎందుకంటే.. క్రికెట్ కారణంగా నేను అతడి కోసం ఎక్కువ సమయం కేటాయించలేకపోవచ్చు. ఇది అర్ధం చేసుకోవాలి’ అని చెప్పారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో మంధాన 74, 38 నాటౌట్ పరుగులు చేశారు. ఇప్పటివరకు 6 టెస్టులు, 80 వన్డేలు మరియు 125 టీ20లు ఆడి 6000 వేలకు పైగా పరుగులు చేశారు.