
Rohit Sharma React on First Class Practice Tests: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తేలిపోయిన రోహిత్ సేన ఆతిథ్య జట్టు చేతిలో దారుణ ఓటమిని మూటకట్టుకుంది. ఈ టెస్టుకు ముందు సరైన సన్నద్ధత లేకపోవడం వల్లే భారత్ ఓడిపోయిందనే విమర్శలు వచ్చాయి. వాటిని కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిపడేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ప్రాక్టీస్ టెస్టులతో పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ అవసరమైన తరహాలో పిచ్‌లు ఉంటే ఓకే అని.. అప్పుడు తాము కూడా బాగా ఆడతామని రోహిత్ చెప్పుకొచ్చాడు.
ఇంట్రా స్క్వాడ్ పోటీల కోసం ప్రాక్టీస్ మ్యాచ్‌లను నిలిపివేయడంపై వచ్చిన ప్రశ్నలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ‘గత 4-5 ఏళ్లలో మేం చాలా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాం. ఫస్ట్‌క్లాస్ టెస్టులు కూడా ఆడాం. అయితే అసలైన టెస్టు మ్యాచ్‌ల కోసం వినియోగించే పిచ్‌లను ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో వాడరు. అందుకే మేం అలాంటి వాటికి దూరంగా ఉండి మాకు అవసరమైన విభాగాలపై దృష్టి పెట్టాం. మాకు అనుకూలమైన పిచ్‌ను తయారు చేయించుకుని ప్రాక్టీస్ చేశాం’ అని రోహిత్ తెలిపాడు.
‘గతంలో మేం ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు, 2018 దక్షిణాఫ్రికా పర్యటనలోనూ అనుకూలమైన పిచ్‌ను తయారు చేయించుకుని ప్రాక్టీస్ చేశాం. ప్రాక్టీస్ పిచ్‌లపై బంతి ఎక్కువగా బౌన్స్ కాదు. అయితే అసలు మ్యాచ్‌ల్లో మాత్రం బంతి తలపైకి వస్తుంది. ఇలాంటి అంశాలు ఉంటాయి కాబట్టే.. మాకు అవసరమైన తరహాలో పిచ్‌లు తయారు చేయించుకుని ప్రాక్టీస్ చేశాం. ప్రాక్టీస్ మ్యాచుల్లోనూ అలాంటి పిచ్‌లు ఉంటే ఓకే.. మేం కూడా ఆడతాం’ అని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. జనవరి 3న దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య రెండో టెస్ట్ ఆరంభం అవుతుంది.