Leading News Portal in Telugu

ICC New Rule: క్రికెట్‌లో కొత్త రూల్‌.. ఫీల్డింగ్‌ టీమ్‌కు శాపం!


ICC New Rule: క్రికెట్‌లో కొత్త రూల్‌.. ఫీల్డింగ్‌ టీమ్‌కు శాపం!

ICC changes stumping rule to stop DRS Misuse: క్రికెట్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. స్టంపౌట్‌ రూల్‌ విషయంలో ఐసీసీ కీలక మార్పులు చేసింది. స్టంపౌట్‌ విషయంలో థర్డ్‌ అంపైర్‌కు ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ రిఫర్‌ చేస్తే.. టీవీ అంపైర్‌ కేవలం స్టంపౌట్‌ మాత్రమే చెక్‌ చేయాలనే నిబంధనను తెచ్చారు. ఈ కొత్త నిబంధన ఫీల్డింగ్‌ టీమ్‌కు శాపంలా మారిందనే చెప్పాలి. అయితే ఇది బ్యాటర్లకు మాత్రం వరంగా మారింది. ఈ నిబంధన గతేడాది డిసెంబర్‌ 12 నుంచే అమల్లోకి వచ్చినట్టు ఐసీసీ పేర్కొంది.


గతంలో ఒక బ్యాటర్‌ను స్టంపౌట్‌ చేసినప్పుడు ఫీల్డింగ్‌ టీమ్‌ ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌కు అప్పీల్‌ చేస్తే.. ఆయన థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేసేవాడు. థర్డ్‌ అంపైర్‌ ముందుగా క్యాచ్‌ (ఆల్‌ట్రా ఎడ్జ్‌)ను చెక్‌ చేసి.. ఆ తర్వాత స్టంప్‌ ఔటా? కాదా? అన్నది పరిశీలించి తన నిర్ణయాన్ని వెల్లడించేవాడు. కొత్త రూల్‌ ప్రకారం ఫీల్డ్‌ అంపైర్‌లు స్టంపౌట్‌కు రిఫర్‌ చేస్తే.. థర్డ్‌ అంపైర్‌ కేవలం స్టంపింగ్‌ను మాత్రమే చెక్‌ చేయాలి. బంతి బ్యాట్‌కు తాకిందా? లేదా? అన్నది పరీశిలించాల్సిన అవసరం లేదు. ఇది బ్యాటర్లకు లాభం చేకూర్చేదే.