Leading News Portal in Telugu

Mitchell Santner Covid 19: మిచెల్‌ సాంట్నర్‌కు కరోనా.. ఐసోలేషన్‌లో న్యూజిలాండ్‌ స్టార్!


Mitchell Santner Covid 19: మిచెల్‌ సాంట్నర్‌కు కరోనా.. ఐసోలేషన్‌లో న్యూజిలాండ్‌ స్టార్!

Mitchell Santner Test Positive for Covid 19: న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. ప్రస్తుతం సాంట్నర్‌ బాగానే ఉన్నాడని, సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించినట్లు న్యూజిలాండ్‌ బోర్డు తెలిపింది. సాంట్నర్‌ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని, రెండో టీ20 జరిగే హామిల్టన్‌కు ఒంటరిగా వెళతాడు అని పేర్కొంది. కరోనా పాజిటివ్‌ కారణంగా పాకిస్తాన్‌తో ఈరోజు ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరిగే తొలి టీ20కి అతడు దూరమయ్యాడు.


ఇటీవలి కాలంలో మంచి ఫామ్‌లో ఉన్న మిచెల్ సాంట్నర్‌.. జట్టులో లేకపోవడం న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బే అని చెప్ప్పాలి. సాంట్నర్ 64 టీ20 ఇన్నింగ్స్‌లలో 16.94 సగటుతో 610 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. 93 మ్యాచ్‌లలో 105 వికెట్లు పడగొట్టి.. బంతితో నిలకడగా రాణిస్తున్నాడు. సాంట్నర్‌ స్థానంలో ఐష్ సోది ఆడే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం జరగనున్న రెండో టీ20కి కూడా సాంట్నర్‌ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

పాకిస్తాన్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ ఆతిథ్యం ఇస్తోంది. శుక్రవారం మొదటి టీ20 ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరగనుంది. భారతకాలమానం ప్రకారం ఉదయం 11: 30 గంటలకు మ్యాచ్ ఆరంభం అయింది. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ చాలాకాలం తర్వాత టీ20 జట్టు పగ్గాలు అందుకున్నాడు. మరోవైపు పాకిస్తాన్‌ టీ20 కెప్టెన్‌గా షాహీన్‌ అఫ్రిదికి ఇది తొలి మ్యాచ్‌.