Leading News Portal in Telugu

WTC Table 2025: డబ్ల్యూటీసీలో అగ్రస్థానానికి ఆస్ట్రేలియా.. భారత్‌కు ఇంగ్లండ్ సిరీస్‌ కీలకం!


WTC Table 2025: డబ్ల్యూటీసీలో అగ్రస్థానానికి ఆస్ట్రేలియా.. భారత్‌కు ఇంగ్లండ్ సిరీస్‌ కీలకం!

WTC 2025 Points Table: టెస్టు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా అదరగొడుతోంది. ఇటీవల పాకిస్థాన్‌పై మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఆసీస్.. తాజాగా అడిలైడ్‌ వేదికగా ముగిసిన మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 పట్టికలో ఆసీస్‌ అగ్రస్థానానికి చేరుకుంది. డబ్ల్యూటీసీ ఎడిషన్‌ 2023-25లో ఇప్పటివరకు తొమ్మిది టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా.. 6 విజయాలు, 2 ఓటములు, ఒక డ్రాతో చేసుకుంది. మొత్తం 61.11 శాతం విజయాలతో పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది.


ఆస్ట్రేలియా వరుస విజయాల కారణంగా భారత్ రెండో స్థానానికి పడిపోయింది. ఈ డబ్ల్యూటీసీ ఎడిషన్‌లో నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలు, ఒక ఓటమి, ఒక డ్రాతో 54.16 శాతంను భారత్ నమోదు చేసింది. దక్షిణాఫ్రికా (50 శాతం), న్యూజిలాండ్‌ (50 శాతం), బంగ్లాదేశ్‌ (50 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవాలంటే సీజన్‌ పూర్తయ్యే నాటికి తొలి రెండు స్థానాల్లో నిలవాలి. త్వరలో భారత్‌కు అత్యంత కఠిన సవాల్ ఎదురుకానుంది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను రోహిత్ సేన ఆడనుంది. ఈ సిరీస్‌ను గెలిస్తేనే మళ్లీ అగ్రస్థానానికి చేరుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం పట్టికలో ఇంగ్లీష్ జట్టు 15 శాతంతో ఏడో స్థానంలో ఉంది.