
Shoaib Malik becomes second player to reach 13000 runs in T20 Cricket: పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 13 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆసియా క్రికెటర్‌గా అవతరించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో శనివారం జరిగిన మ్యాచ్‌లో 18 బంతుల్లో 17 పరుగులు చేసిన షోయబ్.. ఈ మైలురాయిని అందుకున్నాడు. మూడో పెళ్లి చేసుకున్న కొద్ది గంటల్లోనే షోయబ్ ఈ ఫీట్ సాధించడం విశేషం. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు విడాకులు ఇచ్చిన షోయబ్.. పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు.
కొత్త పెళ్లి కొడుకు షోయబ్ మాలిక్ ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఫార్చూన్ బరిషల్ తరఫున ఆడుతున్నాడు. శనివారం రాంగ్‌పుర్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 బంతుల్లో 17 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దాంతో టీ20ల్లో 13 వేల పరుగులు పూర్తిచేశాడు. మొత్తంగా షోయబ్ కంటే విండీస్ హిట్టర్ క్రిస్ గేల్ (14,562) మాత్రమే ముందున్నాడు. టీ20ల్లో మాలిక్ మొత్తం 526 మ్యాచ్‌లు ఆడాడు. 124 అంతర్జాతీయ టీ20ల్లో 2,435 పరుగులు చేశాడు. మిగతావన్నీ ఫ్రాంచైజీ క్రికెట్‌లోనే ఆడాడు. పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్, కరేబియన్ లీగ్, బీపీఎల్, ఐపీఎల్‌తో సహా ఇతర టోర్నీల్లో షోయబ్ పాల్గొన్నాడు.
పాకిస్థాన్ తరఫున టెస్టు, వన్డేలకు వీడ్కోలు పలికిన షోయబ్ మాలిక్.. టీ20లకు మాత్రం రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఫ్రాంచైజీ క్రికెట్ ఆడుతూ.. జాతీయ జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడు. జూన్ 1 నుంచి మొదలయ్యే టీ20 ప్రపంచకప్ ఆడేందుకు అతడు సిద్ధమవుతున్నాడు. పాక్ జట్టు ఎంపికకు అందుబాటులో ఉంటానని గతంలోనే ప్రకటించాడు. అయితే యువకులతో పోటీపడి ఎంపిక కావడం కష్టమే.