Leading News Portal in Telugu

IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. సెహ్వాగ్ రికార్డుపై కన్నేసిన రోహిత్‌!


IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. సెహ్వాగ్ రికార్డుపై కన్నేసిన రోహిత్‌!

Most Sixes Record for India in Test Cricket: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జనవరి 25 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే ఇరు జట్లు సన్నద్ధం అవుతున్నాయి. ఆదివారం ఇంగ్లీష్ జట్టు హైదరాబాద్ చేరుకుంది. నేడు ఉప్పల్ స్టేడియంలో ఇరు జట్లు ప్రాక్టీస్ చేయనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌ హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.


రోహిత్‌ శర్మ మరో 14 సిక్స్‌లు బాదితే.. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బ్రేక్‌ చేస్తాడు. సెహ్వాగ్ టెస్టు క్రికెట్‌లో 91 సిక్సర్లు బాదాడు. రెండో స్ధానంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ (78) ఉన్నాడు. హిట్‌మ్యాన్‌ ప్రస్తుతం 77 సిక్సర్లతో మూడో స్ధానంలో ఉన్నాడు. రెండు సిక్సులే కాబట్టి తొలి టెస్టులోనే ధోనీని రోహిత్ అధిగమించనున్నాడు. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కాబట్టి.. ప్రస్తుత రోహిత్ ఫామ్ చూస్తే సెహ్వాగ్ రికార్డు కూడా బద్దలయ్యే ఛాన్స్ ఉంది. హిట్‌మ్యాన్‌ అలవోకగా సిక్సులు బాదుతాడు అన్న విషయం తెలిసిందే. ఇక టెస్టుల్లో ఇంగ్లండ్‌పై మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌.. 49.80 సగటుతో 747 పరుగులు చేశాడు.

రవీంద్ర జడేజాకు ఈ టెస్టు సిరీస్ చాలా ప్రత్యేకం. ఈ సిరీస్‌లో జడేజా కేవలం 2 వికెట్లు సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో 550 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన 7వ భారత బౌలర్‌గా నిలుస్తాడు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన భారత బౌలర్లలో అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, జవగల్ శ్రీనాథ్ ఉన్నారు. జడేజా ఇప్పటివరకు భారత్ తరపున 68 టెస్టులు, 197 వన్డేలు, 66 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 275, వన్డేల్లో 220, టీ20ల్లో 53 వికెట్లు పడగొట్టాడు.