Leading News Portal in Telugu

Ayodhya Ram Mandir: అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ.. ఆలయాన్ని సందర్శించిన పాక్ క్రికెటర్!


Ayodhya Ram Mandir: అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ.. ఆలయాన్ని సందర్శించిన పాక్ క్రికెటర్!

Danish Kaneria celebrate Ram Mandir PranPratishtha ceremony: శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా సాగిన ఈ మహా క్రతువుకు దేశ, విదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా యావత్ భారతావని ‘జై శ్రీరాం’ నినాదాలతో ప్రతిధ్వనించింది. విదేశాల్లోనూ భారతీయులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. అంతేకాదు విదేశీ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు భారత సంతతి ప్లేయర్స్ కూడా రామమందిర నిర్మాణం గురించి స్పందించారు.


బాలరాముడి ప్రాణప్రతిష్ఠపై పాకిస్థాన్ మాజీ స్పిన్న‌ర్ డానిష్ క‌నేరియా హర్షం వ్యక్తం చేశాడు. సోమవారం రామయ్య ప్రాణప్రాతిష్ఠ వేడుకలు జరుగుతుండగా.. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో ఆలయాన్ని క‌నేరియా సందర్శించాడు. అక్కడి హిందువులతో కలిసి అతడు సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను క‌నేరియా తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నాడు. శ్రీ‌రాముడి విగ్ర‌హం ఫొటోతో ఓ పోస్ట్ పెట్టాడు. ‘శతాబ్దాల నిరీక్షణకు తెరపడింది. కోట్లమంది ప్రార్థనలు నెరవేరాయి. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ పూర్తయింది’ అని ఎక్స్‌లో కనేరియా పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా రామ భక్తిని చాటుకున్నాడు. సోమవారం రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ‘జై శ్రీరామ్’ అంటూ భారతీయులందరికీ శుభాకాంక్షలను తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో శ్రీరాముడి రాక ఫొటోను షేర్ చేసిన వార్నర్.. ‘జై శ్రీరాం ఇండియా’ అని పేర్కొన్నాడు. ఈ పోస్ట్‌కు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇక దక్షిణాఫ్రికాకు ఆడుతున్న భారత సంతతి క్రికెటర్ కేశవ్ మహరాజ్‌ కూడా బాలరాముడి ప్రాణప్రతిష్ఠపై సంతోషం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాలోని భారత సంతతి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశాడు.