Leading News Portal in Telugu

BCCI Awards 2024: ఉత్తమ క్రికెటర్‌గా శుభ్‌మన్‌ గిల్‌.. రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారం!


BCCI Awards 2024: ఉత్తమ క్రికెటర్‌గా శుభ్‌మన్‌ గిల్‌.. రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారం!

Ravi Shastri awarded CK Nayudu Lifetime Achievement Award భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అవార్డుల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ 2022-2023 సంవత్సరానికి ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌ (పాలీ ఉమిగ్రర్‌ బెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు) అవార్డును అందుకున్నాడు. మహిళల కేటగిరీలో బెస్ట్‌ క్రికెటర్‌ అవార్డు దీప్తి శర్మ సొంతం చేసుకుంది. ఇక మాజీ కెప్టెన్, మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. కరోనా మహమ్మారి కారణంగా 2019–20, 2020–21, 2021–22 సీజన్లలో బీసీసీఐ వార్షిక అవార్డులు ప్రదానం చేయలేకపోయారు. దాంతో నాలుగు సీజన్లకు సంబంధించిన పురుషులు, మహిళల, దేశవాళీ క్రికెటర్లకు అవార్డుల్ని ఒకేసారి ప్రదానం చేశారు.


1983లో భారత్‌ వన్డే ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో రవిశాస్త్రి సభ్యుడు. అంతర్జాతీయ కెరీర్‌ అనంతరం టీవీ వ్యాఖ్యతగా ప్రేక్షకుల్ని అలరించాడు. ఆపై భారత పురుషుల టీమ్‌ డైరెక్టర్‌గా, హెడ్‌ కోచ్‌గా సేవలు అందించాడు. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో జట్టును రవిశాస్త్రి మరో దశకు తీసుకెళ్లాడు. ఆటగాడిగా, కోచ్‌గా దేశానికి చేసిన సేవల్ని గుర్తించిన బీసీసీఐ.. 2019–20 సీజన్‌కు గాను సీకే నాయుడు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ (జీవిత సాఫల్య) అవార్డుతో సత్కరించింది. మరోవైపు భరత జట్టుకు చేసిన సేవలకు గాను ఫరూఖ్‌ ఇంజినీర్‌కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది.

పురుషుల విభాగంలో అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించిన ఆటగాళ్లకు ఇచ్చే పాలీ ఉమ్రీగర్‌ బెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డుల్ని 2019–20 సీజన్‌కుగాను సీనియర్ పేసర్ మొహ్మద్ షమీ అందుకోగా.. 2020–21 సీజన్‌లో ఆర్ అశ్విన్, 2021–22 సీజన్‌లో జస్ప్రీత్ బుమ్రా అందుకున్నాడు. మహిళల కేటగిరీలో ఇదే అవార్డును దీప్తి శర్మ (2019–20, 2022–23), స్మృతి మంధాన (2020–21, 2021–22) అందుకున్నారు. యశస్వి జైస్వాల్‌ 2022–23 సీజన్‌కు ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం అవార్డు దక్కింది. ఈ విభాగంలో మయాంక్‌ అగర్వాల్‌ (2019, 20), అక్షర్‌ పటేల్‌ (2020–21), శ్రేయస్‌ అయ్యర్‌ (2021–22) అవార్దులు అందుకున్నారు. ఇంకా అనేక విభాగాల్లో క్రికెటర్లకు అవార్డులను అందించారు.