Leading News Portal in Telugu

IND vs ENG: మహమ్మద్ సిరాజ్‌ ఎందుకు.. రోహిత్ శర్మను ప్రశ్నించిన భారత మాజీ క్రికెటర్!


IND vs ENG: మహమ్మద్ సిరాజ్‌ ఎందుకు.. రోహిత్ శర్మను ప్రశ్నించిన భారత మాజీ క్రికెటర్!

Parthiv Patel react on Mohammed Siraj’s Bowling in Uppal Test: మహమ్మద్ సిరాజ్‌తో ఎక్కువగా బౌలింగ్ చేయించనప్పుడు అతన్ని తుది జట్టులో ఆడించడం ఎందుకు? అని, ఏడు ఓవర్ల కోసం స్పెషలిస్ట్ పేసర్ అవసరమా? అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ పార్థివ్ పటేల్ ప్రశ్నించాడు. సిరాజ్‌కు బదులు ఎక్స్‌ట్రా బ్యాటర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలన్నాడు. అక్షర్ పటేల్‌కు బదులు కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 28 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.


మొదటి టెస్టులో ఇంగ్లండ్ జట్టు పేసర్ మార్క్ వుడ్‌.. ముగ్గురు స్పిన్నర్లు జాక్ లీచ్, టామ్ హార్ట్‌లీ మరియు రెహాన్ అహ్మద్‌లలో బరిలోకి దిగింది. భారత్ భారత్ స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లతో పాటు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లను ఆడించింది. ఈ మ్యాచ్‌లో 24.4 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా.. ఆరు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు ఓవర్లు, రెండవ ఇన్నింగ్స్‌లో ఏడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఇన్నింగ్స్‌లలో ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఈ క్రమంలోనే సిరాజ్‌ బదులు స్పెషలిస్ట్ బ్యాటర్‌ను తీసుకోవడం ఉత్తమమని పార్టీవ్ పటేల్ అభిప్రాయపడ్డాడు.

జియోసినిమా షోలో పార్టీవ్ పటేల్ మాట్లాడుతూ… ‘తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు సరిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే నాకు భిన్నమైన దృక్పథం ఉంది. ఉప్పల్ టెస్ట్ మ్యాచ్‌లో సిరాజ్‌తో 6-7 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించారు. ఈ టెస్ట్ మ్యాచ్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. బ్యాటింగ్ సామర్థ్యం కారణంగానే కుల్దీప్ యాదవ్‌కు బదులు అక్షర్ పటేల్‌ను ఆడిస్తున్నామన్నాడు. అయితే వైవిద్యం కావాలనుకుంటే అక్షర్ స్థానంలో కుల్దీప్‌ని ఎంచుకోవచ్చు. అలానే సిరాజ్‌ను ఎక్కువగా ఉపయోగించకపోతే.. స్పెషలిస్ట్ బ్యాటర్‌ను తీసుకోవడం మంచిది. అప్పుడు భారత బ్యాటింగ్ డెప్త్ బలంగా మారుతుంది’ అని అన్నాడు.

‘ఆర్ అశ్విన్, ఆర్ జడేజా మరియు కుల్దీప్‌లతో జట్టులో మూడు రకాల బౌలర్లు ఉంటారు. అదనపు బ్యాటర్ కారణంగా భారత బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది. సిరాజ్‌తో ఎక్కువగా బౌలింగ్ చేయించనప్పుడు అతన్ని ఆడించడంలో అర్థం లేదు’ అని పార్టీవ్ పటేల్ పేర్కొన్నాడు. ఉప్పల్ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ వైఫల్యంతో ఓడిపోయిన విషయం తెలిసిందే. మొదటి టెస్ట్ నాలుగు రోజుల్లో ముగిసింది. ఇక ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో రెండో టెస్ట్ ఆరంభం అవుతుంది.