Leading News Portal in Telugu

IND vs ENG Playing 11: సర్ఫరాజ్‌ ఖాన్‌ డెబ్యూ.. కుల్దీప్‌కు అవకాశం!


IND vs ENG Playing 11: సర్ఫరాజ్‌ ఖాన్‌ డెబ్యూ.. కుల్దీప్‌కు అవకాశం!

Harbhajan Singh India Playing 11 vs England for Vizag Test: విశాఖ వేదికగా శుక్రవారం (ఫిబ్రవరి 2) నుంచి భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం రెండు రోజుల క్రితమే వైజాగ్‌కు చేరుకున్న భారత జట్టు.. తమ అస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. హైదరాబాద్ మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిన రోహిత్ సేన.. విశాఖలో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. సీనియర్ ప్లేయర్స్ కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు రెండో టెస్టుకు దూరం కావడంతో భారత ప్లేయింగ్ ఎలెవన్‌పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన తుది జట్టుని ప్రకటించాడు.


గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన కేఎల్‌ రాహుల్‌ ఐదో స్ధానంలో దేశవాళీ స్టార్ సర్ఫరాజ్ ఖాన్‌ను బ్యాటింగ్‌కు పంపిస్తే బాగుంటుందన్నాడు. సర్ఫరాజ్ దేశవాళీ క్రికెట్‌లో భారీగా పరుగులు చేయడమే కాకుండా.. తాజాగా ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడని గుర్తుచేశాడు. వైజాగ్‌ టెస్టులో భారత్ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని హర్భజన్ సూచించాడు. తొలి టెస్టులో పెద్దగా ఆకట్టుకోకపోయిన మహ్మద్ సిరాజ్‌ స్ధానంలో మణికట్టు స్పిన్నర్‌ కుల్దీప్ యాదవ్‌కు చోటు ఇచ్చాడు. కుల్దీప్ వికెట్‌కు రెండు వైపులా బంతిని టర్న్‌ చేయగల నేర్పరి అని, 2023 ప్రపంచకప్‌లో అతడి నైపుణ్యం చూశామన్నాడు. వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇచ్చిన హర్భజన్.. రజత్ పటిదార్‌కు షాక్ ఇచ్చాడు.

హర్భజన్ సింగ్ తుది జట్టు ఇదే:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్, సర్ఫరాజ్‌ ఖాన్, వాషింగ్టన్ సుందర్, కేఎస్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్.