Leading News Portal in Telugu

IND vs ENG: విశాఖలో రోహిత్ శర్మ రికార్డులు అదుర్స్.. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలే!


IND vs ENG: విశాఖలో రోహిత్ శర్మ రికార్డులు అదుర్స్.. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలే!

Rohit Sharma Records in Vizag Stadium: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్.. రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్లనుకుంటోంది. మరోవైపు మొదటి మ్యాచ్‌లో ఓడిన భారత్.. ఈ టెస్టులో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని భావిస్తోంది. రెండో టెస్టులో విరాట్ కోహ్లీతో పాటు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ లేకపోవడం టీమిండియాకు ప్రతికూలంగా మారింది. అయితే విశాఖలో కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డులు బాగుండడం ఊరట కలిగించే విషయం.


విశాఖలోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. రెండు ఇన్నింగ్స్‌లలో 151.50 సగటుతో 303 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు చేసిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులు చేశాడు. విశాఖలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌ కూడా రోహితే. విరాట్ కోహ్లీ (299), మయాంక్ అగర్వాల్ (222), ఛెతేశ్వర్ పుజారా (207), అజింక్యా రహానే (91)లు టాప్-5లో ఉన్నారు.

విశాఖపట్నంలో రోహిత్ శర్మ మూడు ఫార్మాట్‌లలోని 4 ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు చేశాడు. 4 ఇన్నింగ్స్‌ల్లో 176, 127, 159, 13 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో రోహిత్ 159 పరుగులు చేశాడు. ఇప్పటివరకు భారత్ తరఫున రోహిత్ 55 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 3800 పరుగులు చేశాడు. ఇందులో16 హాఫ్ సెంచరీలు, 10 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 212. రోహిత్ టెస్టుల్లో లేటుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 2007 టీ20 అరంగేట్రం చేసిన రోహిత్.. 2013లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.