Leading News Portal in Telugu

Budget 2024: క్రీడల బడ్జెట్‌.. గతేడాది కంటే రూ.45.36 కోట్లు ఎక్కువ!


Budget 2024: క్రీడల బడ్జెట్‌.. గతేడాది కంటే రూ.45.36 కోట్లు ఎక్కువ!

Sports Ministry Gets Rs 3,442.32 crore in Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం అనంతరం లోక్‌సభలో కేంద్ర పద్దును ప్రవేశపెట్టారు. ఈ మధ్యంతర బడ్జెట్‌లో క్రీడలకు ప్రాధాన్యం దక్కింది. బడ్జెట్‌లో క్రీడలకు రూ.3,442.32 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోల్చుకుంటే.. రూ.45.36 కోట్లు ఎక్కువ నిధులను ఇచ్చారు. గతేడాది బడ్జెట్‌లో క్రీడలకు రూ.3,396.96 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.


2024 జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌కు క్రీడల బడ్జెట్‌లో ప్రాధాన్యం దక్కింది. ఖేలో ఇండియాకు రూ.900 కోట్లు కేటాయించారు. గతంతో పోల్చుకుంటే రూ.20 కోట్లు ఎక్కువ. శిక్షణ శిబిరాలు, మౌలిక వసతుల ఏర్పాటు, పరికరాల కొనుగోలు సహా ఇతర అవసరాల కోసం భారత క్రీడా ప్రాధికార సంస్థకు రూ.795.77 కోట్లు కేటాయించారు. 2023తో పోల్చితే.. రూ.26.83 కోట్లు ఎక్కువ. ఇక జాతీయ క్రీడా సమాఖ్యలకు రూ.325 కోట్లు, జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా)కు రూ.22.30 కోట్లు నిధులు కేటాయించారు.