Leading News Portal in Telugu

IND vs ENG: లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 103/2! మరోసారి నిరాశపర్చిన రోహిత్‌


IND vs ENG: లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 103/2! మరోసారి నిరాశపర్చిన రోహిత్‌

Yashasvi Jaiswal Hits Half Century in IND vs ENG 2nd Test: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య విశాఖపట్నంలోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్‌ మొదటి రోజు తొలి సెషన్‌ మగిసింది. లంచ్‌ బ్రేక్‌ సమయానికి టీమిండియా 31 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 103 రన్స్ చేసింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ హాఫ్‌ సెంచరీ చేశాడు. క్రీజులో జైస్వాల్‌ (51) సహా శ్రేయస్‌ అయ్యర్ (4) ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (14) మరోసారి నిరాశపరిచాడు. శుభమాన్ గిల్‌ (34) పరుగులు చేశాడు.


రెండో టెస్టులో టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు రోహిత్, జైస్వాల్‌లు ఇన్నింగ్స్ ఆరంభంలో అచ్చితోచి ఆడారు. ఇద్దరు బౌండరీలకు పోకుండా.. సింగిల్స్ తీశారు. ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌లో రోహిత్‌కు అరంగేట్ర స్పిన్నర్ షోయబ్ బషీర్‌ పెవిలియన్ చేర్చాడు. ప్లాన్‌గా లెగ్‌ స్లిప్‌ ఫీల్డర్‌ను పెట్టుకుని మరి రోహిత్‌ను బుట్టలో వేసుకున్నాడు. బంతి అనుహ్యంగా టర్న్‌ అయ్యి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని లెగ్‌ స్లిప్‌ ఫీల్డర్‌ ఒలీ పోప్‌ చేతికి వెళ్లింది. 41 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌ 14 పరుగులు చేసి ఔటయ్యాడు. బషీర్‌కు ఇదే తొలి టెస్టు వికెట్‌ కావడం గమనార్హం.

రోహిత్ శర్మ అనంతరం క్రీజులోకి వచ్చిన శభ్‌మన్‌ గిల్‌ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా ఆపై వేగం పెంచాడు. మరోవైపు జైస్వాల్‌ కూడా దూకుడుగా ఆడాడు. దాంతో భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే వరుసగా బౌండరీలు సాధిస్తూ జోరుమీదున్న గిల్‌ను జేమ్స్ అండర్సన్‌ వెనక్కి పంపాడు. బౌండరీతో జైస్వాల్‌ హాఫ్ సెంచరీ చేశాడు. ఇంగ్లండ్ బౌల‌ర్లు అండ‌ర్స‌న్, బ‌షీర్ తలో వికెట్ తీశారు.