Leading News Portal in Telugu

Vizag Test: మూడో రోజు టీ బ్రేక్.. భారత్ ఆధిక్యం 370! గిల్ సెంచరీ


Vizag Test: మూడో రోజు టీ బ్రేక్.. భారత్ ఆధిక్యం 370! గిల్ సెంచరీ

వైజాగ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 227 రన్స్ చేసింది. క్రీజ్‌లో రవిచంద్రన్ అశ్విన్ (1), కేఎస్ భరత్ (6) ఉన్నారు. ఈ సెషన్‌లో 2 వికెట్లను కోల్పోయిన టీమిండియా 97 పరుగులు చేసింది. సెంచరీ చేసిన అనంతరం బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ (104).. హాఫ్‌ సెంచరీకి చేరువలో ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్ (45) ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 370 పరుగులుగా ఉంది. ప్రస్తుతానికి భారత్ రెండో టెస్టుపై పట్టు బిగించింది.


రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌ నైట్‌ 28/0 స్కోరుతో మూడో రోజైన ఆదివారం ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లండ్ పేసర్ జేమ్స్‌ అండర్సన్ వరుస ఓవర్లలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (17), రోహిత్ శర్మ (13)ను ఔట్ చేశాడుపంపాడు. ఈ సమయంలో శ్రేయస్‌ అయ్యర్ (29)తో కలిసి శుభ్‌మన్‌ గిల్ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. రెండుసార్లు లైఫ్‌లు రావడంతో గిల్ బతికిపోయాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని బ్యాట్‌ను ఝుళిపించాడు. 132 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అక్షర్‌తో కలిసి ఐదో వికెట్‌కు 89 పరుగులు జోడించిన అనంతరం బషీర్‌ బౌలింగ్‌లో గిల్‌ పెవిలియన్‌ చేరాడు.

కాసేపటికే క్రీజులో కుదురుకున్న అక్షర్ పటేల్ కూడా హార్ట్‌లీ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. తొలుత అంపైర్‌ నాటౌట్‌ ఇవ్వగా.. ఇంగ్లండ్ టీమ్ డీఆర్‌ఎస్‌కు వెళ్లింది. సమీక్షలో ఔట్‌ అయినట్లు ఫలితం రావడంతో.. అక్షర్ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. ఆపై కేఎస్ భరత్, ఆర్ అశ్విన్ వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులు చేయగా.. భారత్ 396 రన్స్ చేసింది.