Leading News Portal in Telugu

AUS vs WI: 6.5 ఓవర్లలోనే వన్డేల్లో లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా!


AUS vs WI: 6.5 ఓవర్లలోనే వన్డేల్లో లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా!

Australia beat West Indies in 6.5 overs: గ‌బ్బా టెస్టులో వెస్టిండీస్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా.. వ‌న్డే సిరీస్‌లో మాత్రం త‌డాఖా చూపించింది. మూడు వ‌న్డేల్లోనూ వెస్టిండీస్ జ‌ట్టును చిత్తు చిత్తుగా ఓడించింది. ముఖ్యంగా కాన్‌బెర్రా వేదికగా మనుకా ఓవల్‌ మైదానంలో మంగళవారం జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆసీస్.. విండీస్‌ను వైట్‌వాష్ చేసింది. మూడు వ‌న్డేలో కేవలం 6.5 ఓవర్లలోనే విండీస్‌ విధించిన లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించింది. ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై అతి త‌క్కువ బంతుల్లో ఫ‌లితం తేలిన మొద‌టి వ‌న్డే ఇదే కావడం విశేషం. మొత్తంగా చూస్తే..త‌క్కువ ఓవ‌ర్ల‌లో ముగిసిన ఆరో మ్యాచ్ ఇది.


ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. వెస్టిండీస్ బ్యాటింగ్‌కు దిగింది. ఆసీస్ బౌలర్ల ధాటికి విండీస్‌ 24.1 ఓవర్లలో 86 పరుగులకే ఆలౌట్‌​ అయింది. విండీస్ ఇన్నింగ్స్‌లో ఓపెన‌ర్ అలిక్ అథ‌నాజే 32 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. కీసీ కార్టీ (10), రోస్టన్ చేజ్ (12) మాత్రమే రెండంకెల స్కోర్ అందుకున్నారు. నలుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఆసీస్ యువ పేసర్‌ జేవియర్‌ బ్రాట్‌లెట్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు. లాన్స్‌ మోరిస్‌, ఆడం జంపా రెండేసి వికెట్లు పడగొట్టారు.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ 6.5 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు జేక్‌ ఫ్రాసెర్‌ మెక్‌గర్క్‌ (41), జోష్‌ ఇంగ్లిస్‌ (35) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే స్వల్ప వ్యవధిలో జేక్‌, ఆరోన్‌ హార్డీ (2) ఔట్ అయినా.. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (6)తో కలిసి ఇంగ్లిస్‌ జట్టును విజయాన్ని అందించాడు. జేవియర్‌ బ్రాట్‌లెట్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు కూడా దక్కింది. టెస్టు సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకున్న వెస్టిండీస్.. వన్డే సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. ఇక మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ ఫిబ్రవరి 9 నుంచి ఆరంభం కానుంది.