Leading News Portal in Telugu

U19 World Cup 2024: నేడు దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్‌.. సూపర్‌ ఫామ్‌లో యువ భారత్‌!


U19 World Cup 2024: నేడు దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్‌.. సూపర్‌ ఫామ్‌లో యువ భారత్‌!

India U19 vs South Africa U19 Semi-Final 1: అండర్‌-19 ప్రపంచకప్‌ 2024 సెమీఫైనల్‌ 1 మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌, ఆతిథ్య దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. సూపర్‌ ఫామ్‌లో ఉన్న యువ భారత్‌కు టోర్నీలో ఇప్పటివరకు ఓటమన్నదే తెలియదు. సెమీస్‌కు ముందు ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్‌.. అదే జోరు సెమీఫైనల్‌లో కూడా కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా టీమిండియా బరిలోకి దిగుతోంది. పటిష్ట భారత జట్టును నిలువరించడం దక్షిణాఫ్రికాకు కష్టమే అని చెప్పాలి.


అండర్‌-19 ప్రపంచకప్‌ 2024లో ఆడిన అన్ని మ్యాచ్‌లలో మూడు విభాగాల్లోనూ భారత్‌ రాణించింది. రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో ముషీర్‌ ఖాన్‌ జోరుమీదున్నాడు. 334 పరుగులు చేసిన ముషీర్‌.. టోర్నీ టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. 304 పరుగులు చేసిన కెప్టెన్‌ ఉదయ్‌ సహరన్‌ కూడా ఫామ్‌లో ఉన్నాడు. నేపాల్‌ మ్యాచ్‌లో సచిన్‌ దాస్‌ సెంచరీ (116) బాదాడు. వీరిని అడ్డుకోవడం ప్రొటీస్ బౌలర్లకు కష్టమే.

మరోవైపు యువ భారత్ బౌలింగ్‌లో కూడా రాణిస్తోంది. బౌలర్ సౌమి కుమార్‌ పాండే అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 2.17 ఎకానమీతో 16 వికెట్లు పడగొట్టాడు. అతడి బౌలింగ్‌లో పరుగులు చేయడం అంత సులువు కాదు. పేసర్లు నమన్‌ తివారి, రాజ్‌ లింబాని కూడా రాణిస్తుండడం కలిసొచ్చే అంశం. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం అయ్యే ఈ మ్యాచ్ స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది. మరో సెమీస్‌లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ తలపడనున్నాయి.