
Daryl Mitchell Injury Scary to CSK ahead of IPL 2024: దక్షిణాఫ్రికాతో జరగబోయే రెండో టెస్టుకు ముందుగా న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి బొటన వేలుకు గాయం కాగా.. అది తీవ్రతరం కావడంతో మిచెల్‌కు రెస్ట్ ఇవ్వాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. మిచెల్ స్థానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ విల్ ఓరూర్క్‌ను జట్టులోకి తీసుకున్నట్లు న్యూజిలాండ్ బోర్డు ప్రకటించింది.
డారిల్ మిచెల్ గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్వదేశంలో ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్‌కు కూడా అతడు దూరమయ్యే ఛాన్స్ ఉంది. మిచెల్ మూడు ఫార్మాట్లలో మాకు కీలక ఆటగాడు, అతడు గాయపడటం మా దురదృష్టం అని కివీస్ హెడ్‌కోచ్ గ్యారీ స్టీడ్ అన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 281 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. కివీస్ విజయంలో మిచెల్ కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్ 2024కు ముందు డారిల్ మిచెల్ గాయం చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆందోళన కలిగిస్తోంది. అయితే ఐపీఎల్ ఆరంభానికి ఇంకా నెలకు పైగా సమయం ఉండడంతో మిచెల్ కోలుకునే ఛాన్స్ ఉంది. గతేడాది జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో మిచెల్‌ను రూ. 14 కోట్లకు చెన్నై కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో మిచెల్ రాణించిన విషయం తెలిసిందే. అందుకే మిగతా ప్రాంచైజీలతో పోటీపడి చెన్నై అతడిని కొనుగోలు చేసింది. మిచెల్ రాకతో సీఎస్‌కే మిడిల్ ఆర్డర్ పటిష్టంగా మారింది.