Leading News Portal in Telugu

IND vs ENG: టీమిండియాకు భారీ షాక్‌.. స్టార్‌ ప్లేయర్ దూరం!



Team India Test

Shreyas Iyer have stiff back and groin pain: స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే గాయాల కారణంగా బ్యాటర్ కేఎల్‌ రాహుల్‌, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా జట్టుకు దూరంగా కాగా.. తాజాగా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌కు గాయం తిరగబెట్టింది. వెన్ను గాయం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగే చివరి మూడు టెస్టు మ్యాచ్‌లకు శ్రేయాస్ దూరమయ్యే అవకాశం ఉంది. తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్న శ్రేయాస్.. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో చేరినట్లు సమాచారం.

ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు శ్రేయాస్ అయ్యర్‌ దూరం కానున్నట్లు ఓ జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. వెన్ను, గజ్జల్లో గాయంతో అతడు బాధపడుతున్నాడట. శ్రేయాస్ సామగ్రిని ముంబైలోని అతని ఇంటికి పంపారట. గత సంవత్సరం వెన్ను గాయంకు అతడు శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. శ్రేయాస్ తిరిగి ఐపీఎల్‌ 2024తో మైదానంలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. టెస్ట్ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు టెస్టులు ఆడిన శ్రేయాస్.. అంచనాలను అందుకోలేకపోయాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో 104 పరుగులు మాత్రమే చేశాడు.

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ గురించి సెలక్టర్లు పట్టించుకోవడం లేదు.. జట్టును ప్రకటించకపోవడానికి కారణం ఆ ముగ్గురే!

ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శుక్రవారం నాడు ప్రకటించే ఛాన్స్‌ ఉంది. ఓవైపు జట్టును గాయాలు వెంటాడుతుంటే.. మరోవైపు స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ అందుబాటుపై ఇంకా సందిగ్ధం నెలకొంది. ఇప్పటివరకు అయితే విరాట్ నుంచి ఎటువంటి సమాచారం లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో చివరి మూడు టెస్టులకు రజిత్‌ పాటిదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ను కొనసాగించే అవకాశముంది. ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఇరు జట్లు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్నాయి.