Leading News Portal in Telugu

U19 World Cup 2024: సెమీ‌స్‌లో ఆస్ట్రేలియాపై ఓటమి.. మైదానంలో ఏడ్చేసిన పాకిస్తాన్ ఆటగాళ్లు!


U19 World Cup 2024: సెమీ‌స్‌లో ఆస్ట్రేలియాపై ఓటమి.. మైదానంలో ఏడ్చేసిన పాకిస్తాన్ ఆటగాళ్లు!

Pakistan U19 Players cried after defeted by Australia: గురువారం విల్మోర్ పార్క్‌లో ఉత్కంఠభరితంగా సాగిన అండర్‌-19 ప్రపంచకప్‌ 2024 సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా ఒక్క వికెట్‌ తేడాతో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించింది. టామ్‌ స్ట్రేకర్‌ (6/24), డిక్సన్‌ (50; 75 బంతుల్లో 5×4) ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 48.5 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో ఆసీస్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. సెమీఫైనల్లో పరాజయం ఎదురవ్వడంతో పాక్ ఆటగాళ్లు మైదానంలో కన్నీటి పర్యంతమయ్యారు.


సెమీ ఫైనల్లో విజయానికి చేరువగా వచ్చి.. పరాజయం పాలవ్వడంతో పాకిస్తాన్ ఆటగాళ్లు మైదానంలో ఏడ్చేశారు. ఉబికి వస్తున్న దు:ఖాన్ని పాక్ ప్లేయర్స్ ఆపుకోలేకపోయారు. విన్నింగ్ షాట్ అనంతరం పాక్ ప్లేయర్స్ అందరూ మైదానంలో అలానే కూర్చొని కన్నీటి పర్యంతమయ్యారు. విన్నింగ్ షాట్‌ను ఆపేందుకు డైవ్ చేసి విఫలమైన పాక్ ఆటగాడు ఉబైద్ షా.. నేలపై అలానే పడుకున్నాడు. ప్రస్తుతం పాక్ ఆటగాళ్ల భావోద్వేగానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

180 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు పాకిస్తాన్ ఆటగాళ్లు అన్నివిధాల ప్రయత్నించారు. చివరకు విజయం వైపు అడుగులు వేశారు. అయితే దురదృష్టవశాత్తు చివరి వికెట్ తీయలేక ఓటమిపాలయ్యారు. చివరి ఆటగాడు కల్లమ్ వైడ్లర్‌ (2)తో కలిసి రఫ్ మాక్ మిలన్ (19) 17 పరుగులు చేసి ఆసీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 48.5 ఓవర్లలో 179 పరుగులకు కుప్పకూలింది. అజాన్ అవైస్ (52), అరఫత్ మిన్‌హాస్ (52) హాఫ్ సెంచరీలు చేశారు. ఆసీస్ బౌలర్ టామ్ స్ట్రాకర్ (6/24) ఆరు వికెట్ల‌తో చెలరేగాడు. చేధనలో ఆసీస్ 49.1 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసి గెలుపొందింది. హారీ డిక్సన్ (50) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఓలివర్ పీక్ (49) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో అలీ రాజా నాలుగు వికెట్లు తీశాడు. ఆదివారం జరగనున్న తుది పోరులో భారత్‌తో ఆసీస్ అమీతుమీ తేల్చుకోనుంది.