Unforeseen Swing Ball leaving cricket fans: స్పిన్ దిగ్గజం ‘షేన్ వార్న్’ తన సంచలన బౌలింగ్ ప్రదర్శనతో అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. టెస్టుల్లో 708, వన్డేల్లో 293 వికెట్స్ తీసినా.. ఒకే ఒక బంతి అతడికి ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. 1993లో యాషెస్ సిరీస్‌లో వార్న్ వేసిన నమ్మశక్యం కాని బంతి చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’గా రికార్డుల్లోకి ఎక్కింది. వార్న్ ‘లైఫ్ టైమ్ డెలివరీ’ని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. తాజాగా ఒక లెగ్ స్పిన్నర్ అలాంటి బంతిని విసిరాడు.
కేసీసీ టీ20 ఛాలెంజర్స్ కప్ 2024లో భాగంగా కువైట్ నేషనల్స్, ఎస్బీఎస్ సీసీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. కువైట్ నేషనల్స్‌కు చెందిన ముహమ్మద్ వకార్ అంజుమ్ అద్భుత బంతితో ఎస్బీఎస్ సీసీ బ్యాటర్ బియాంత్ సింగ్‌ను ఔట్ చేశాడు. లక్ష్య ఛేదనలో బియాంత్ బ్యాటింగ్ చేస్తుండగా.. స్పిన్ దిగ్గజాలు ముత్తయ్య మురళీధరన్, హర్భజన్ సింగ్ బౌలింగ్ యాక్షన్లను తలపిస్తూ ముహమ్మద్ ఓ బంతిని సంధించాడు. ఫుల్ టాస్ పడిన ఆ బంతి ఊహించని విధంగా టర్న్ అయి వికెట్లను గిరాటేసింది. బియాంత్ షాక్ కొట్టేలోపే బంతి వికెట్లను తాకింది.
ముహమ్మద్ వకార్ అంజుమ్ వేసిన బంతికి బియాంత్ సింగ్ ఒక్కరిగా బిత్తరపోయాడు. ఒక్క క్షణం అతడికి అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. చివరకు పెవిలియన్ బాట పట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి నెట్టింట లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’, ‘షేన్ వార్న్ గుర్తుకొస్తాడు’, ‘తప్పక చూడాల్సిన వీడియో’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
— Out Of Context Cricket (@GemsOfCricket) February 12, 2024