Leading News Portal in Telugu

IND vs ENG: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. కేఎల్‌ రాహుల్‌ దూరం! దేవ్‌దత్‌ పడిక్కల్‌కు అవకాశం


IND vs ENG: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. కేఎల్‌ రాహుల్‌ దూరం! దేవ్‌దత్‌ పడిక్కల్‌కు అవకాశం

KL Rahul Ruled Out Of IND vs ENG 3rd Test: ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో టెస్టుకు టీమిండియా సీనియర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో.. రాహుల్‌ను మూడో టెస్టు నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రాహుల్‌ స్థానంలో కర్ణాటక లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ను జట్టుకు ఎంపిక చేసింది. మొదటి టెస్ట్ ఆడిన రాహుల్.. గాయం కారణంగా రెండో టెస్ట్ ఆడలేదు.


‘కేఎల్ రాహుల్‌ మూడో టెస్టుకు దూరమయ్యాడు. అతడు 90 శాతం మ్యాచ్‌ ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. బీసీసీఐ వైద్యుల బృందం పర్యవేక్షణలో రాహుల్ పురోగతి సాధిస్తున్నాడు’అని బీసీసీఐ పేర్కొంది. చివరి మూడు టెస్టులకు ఇటీవల ఎంపిక చేసిన భారత జట్టులో లోకేష్ రాహుల్‌, రవీంద్ర జడేజాలకు సెలక్షన్‌ కమిటీ చోటు కల్పించింది. అయితే బీసీసీఐ వైద్య బృందం నుంచి అనుమతి వస్తేనే.. వాళ్లు తుది జట్టులో ఆడతారని పేర్కొంది. రాహుల్ స్థానంలో ఎంపికయిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో బాగా ఆడుతున్నాడు. రంజీ ట్రోఫీతో పాటు భారత్‌ ‘ఎ’ తరఫున కూడా రాణించాడు.

భారత్‌తో మూడో టెస్టు కోసం ఇంగ్లండ్ టీమ్ అబుదాబి నుంచి సోమవారం సాయంత్రం రాజ్‌కోట్‌ చేరుకుంది. రెండో టెస్టుకు, మూడో టెస్టుకు మధ్య విరామం ఉండడంతో ఇంగ్లీష్ ప్లేయర్స్ అబుదాబిలో విశ్రాంతి తీసుకున్నారు. సోమావారం రాజ్‌కోట్‌ చేసిన ఇంగ్లండ్.. మంగళవారం ఎస్‌సీఏ స్టేడియంలో సాధన చేయనుంది. మరోవైపు భారత్ జట్టు కూడా రాజ్‌కోట్‌ చేరుకుని ప్రాక్టీస్ చేస్తోంది. మూడో టెస్టు ఫిబ్రవరి 15న ఆరంభమవుతుంది. ఐదు టెస్టుల సిరీస్‌ 1-1తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే.