Leading News Portal in Telugu

Ishan Kishan: బీసీసీఐ వార్నింగ్‌.. వెనక్కితగ్గిన ఇషాన్‌ కిషన్‌!


Ishan Kishan: బీసీసీఐ వార్నింగ్‌.. వెనక్కితగ్గిన ఇషాన్‌ కిషన్‌!

Ishan Kishan to play Ranji Trophy 2024 Match after BCCI Slams: టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్‌ కిషన్‌ దూకుడు కాస్త తగ్గినట్టు ఉంది. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఉన్న ఆటగాళ్లు జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాలీ టోర్నీల్లో తప్పక ఆడాలని బీసీసీఐ వార్నింగ్‌ ఇచ్చిన నేపథ్యంలో.. ఈ వారంలో రాజస్థాన్‌తో జరిగే జార్ఖండ్ చివరి రంజీ ట్రోఫీ లీగ్ గేమ్‌లో ఇషాన్ ఆడనున్నాడని తెలుస్తోంది. అంతేకాదు త్వరలో ప్రారంభంకానున్న డీవై పాటిల్‌ టోర్నీలో కూడా పాల్గొనాలని నిర్ణయించుకున్నాడట. ఐపీఎల్‌ 2024 ప్రాక్టీస్‌ను పక్కన పెట్టి దేశవాలీ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్దమయ్యాడట.


2023 డిసెంబర్ నుంచి ఇషాన్‌ కిషన్‌ భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇషాన్‌.. వ్యక్తిగత కారణాలతో సిరీస్ ఆరంభానికి ముందే స్వదేశానికి వచ్చాడు. అప్పటి నుంచి బీసీసీఐ, టీమ్ మేనెజ్‌మెంట్‌తో టచ్‌లో లేడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఇషాన్‌ అందుబాటులో ఉంటాడనుకున్నా.. అది జరగలేదు. రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంకు గురికావడంతో రెగ్యులర్‌ కీపర్‌ సమస్య వేధిస్తున్న నేపథ్యంలో ఇషాన్‌ను జట్టులోకి తీసుకోవాలని చాలా మంది సూచించారు. అయితే 2 నెలలకు పైగా ఎలాంటి క్రికెట్‌ ఆడని అతడిని నేరుగా తుది జట్టులో ఎలా తీసుకుంటామని బీసీసీఐ వాదిస్తుంది.

ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు ఎంపిక కావాలంటే ఇషాన్‌ కిషన్‌ కచ్చితంగా రంజీ ట్రోఫీ 2024లో ఆడాల్సిందే అని భారత హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ స్పష్టం చేశాడు. అయితే కిషన్‌ మాత్రం రాహుల్‌ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోకుండా.. బరోడాలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లతో కలిసి ఐపీఎల్ 2024 కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. జార్ఖండ్ తరఫున రంజీ ట్రోఫీ 2024లో బరిలో దిగే అవకాశం ఉన్నా.. ఇషాన్ ఐపీఎల్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇషాన్ ప్రవర్తనపై బీసీసీఐ సీరియస్‌ అయింది. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కలిగిన ప్లేయర్స్.. జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాలీ టోర్నీల్లో ఆడాలని తప్పనిసరి చేసింది. జాతీయ జట్టు సభ్యులకు, ఎన్‌సీఏలో ఉన్న ఆటగాళ్లకు ఇందుకు మినహాయింపు ఉందని పేర్కొంది.

బీసీసీఐ ప్రకటన పరోక్షంగా తనను ఉద్దేశించే అని గ్రహించిన ఇషాన్‌ ఇషాన్ ఎట్టకేలకు దిగొచ్చాడు. ఐపీఎల్‌ 2024 ప్రాక్టీస్‌ను పక్కన పెట్టి.. ఈ నెల 16 నుంచి రాజస్థాన్‌తో జరిగే జార్ఖండ్ చివరి రంజీ ట్రోఫీ లీగ్ గేమ్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాడట. త్వరలో ప్రారంభంకానున్న డీవై పాటిల్‌ టోర్నీలో కూడా బరిలోకి దిగుతాడట. ఈ విషయాన్ని ఇషాన్‌ స్వయంగా చెప్పనప్పటికీ.. అతని సన్నిహితులు మీడియాతో చెప్పినట్లు సమాచారం. ఐపీఎల్‌ 2024కు ముందు దేశవాలీ టోర్నీల్లో ఆడకుంటే.. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ రద్దవుతుందని ఇషాన్‌ బయపడ్డాడట.