Leading News Portal in Telugu

Rohit Sharma: ముంబై ఇండియన్స్‌ భవిష్యత్తు కోసమే కెప్టెన్సీలో మార్పు!


Rohit Sharma: ముంబై ఇండియన్స్‌ భవిష్యత్తు కోసమే కెప్టెన్సీలో మార్పు!

Sunil Gavaskar React on Rohit Sharma Mumbai Indians Captaincy: ఐపీఎల్ 2024 ముందు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీలో మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఐదు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్‌ పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది. దాంతో సోషల్ మీడియాలో రోహిత్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. హిట్‌మ్యాన్‌ అభిమానులు ముంబై మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆపై కోచ్‌ మార్క్‌ బౌచర్‌ వ్యాఖ్యలు, రోహిత్ సతీమణి రితికా సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి. తాజాగా ముంబై కెప్టెన్సీ మార్పుపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు. ముంబై టీమ్ భవిష్యత్తు గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుందని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.


స్టార్ స్పోర్ట్స్‌తో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ‘ముంబై జట్టు భవిష్యత్తు గురించి ఆలోచించింది. రోహిత్‌ శర్మకు ఇప్పుడు 36 ఏళ్లు. ఇప్పటికే అతడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. భారత జట్టుకు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా ఉన్నాడు. హిట్‌మ్యాన్‌పై ఉన్న భారాన్ని కొంత తగ్గించాలనే ఉద్దేశంతోనే హార్దిక్‌ పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది. దీంతో ముంబైతో పాటు రోహిత్‌కు ప్రయోజనం చేకూరనుంది. రోహిత్ మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉంది. టాప్‌ ఆర్డర్‌లో హిట్‌మ్యాన్‌ మరిన్ని పరుగులు రాబడితే జట్టుకు కలిసొస్తుంది. హార్దిక్‌ మూడు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేయగలడు. అప్పుడు ముంబై 200లకు పైగా స్కోరు చేసే అవకాశాలు ఉంటాయి’ అని అన్నాడు.

గుజరాత్‌ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ పాండ్యాను రికార్డు స్థాయి ధర చెల్లించి మరీ ముంబై ఇండియన్స్ తీసుకుంది. రోహిత్ శర్మను కెప్టెన్‌గా తొలగిస్తున్నట్లు ప్రకటించిన గంట వ్యవధిలోనే.. ముంబై జట్టు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 4 లక్షల మంది అభిమానులు వీడారు. ఇప్పుడు పరిస్థితి బాగానే ఉన్నా.. ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందు మళ్లీ ఫాన్స్ రచ్చ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక రోహిత్ గత సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 332 పరుగులు చేశాడు. రోహిత్ నాయకత్వంలో ముంబై 87 మ్యాచ్‌లు గెలిచి, 67 మ్యాచ్‌లలో ఓడిపోయింది.