Leading News Portal in Telugu

Sarfaraz Khan: సర్ఫరాజ్ సతీమణి భావోద్వేగం.. వీడియో వైరల్!


Sarfaraz Khan: సర్ఫరాజ్ సతీమణి భావోద్వేగం.. వీడియో వైరల్!

Sarfaraz Khan Wife Romana Zahoor Gets Emotional: రాజ్‌కోట్‌ వేదికగా భారత్‌, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ టెస్ట్ కోసం నాలుగు మార్పులు చేశాడు. రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ జట్టులోకి రాగా.. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌లు అరంగేట్రం చేశారు. టీమిండియా తరఫున అరంగేట్రం చేయాలన్న సర్ఫరాజ్‌ చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. టీమిండియా స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే చేతుల మీదుగా టీమిండియా క్యాప్‌ అందుకున్నాడు. ఆ సమయంలో సర్ఫరాజ్‌ తండ్రి నౌషధ్‌ ఖాన్‌, భార్య రొమానా జహూర్‌ పక్కనే ఉన్నారు.


టీమిండియా క్యాప్‌ను సర్ఫరాజ్ ఖాన్ తన సతీమణి రొమానా జహూర్‌కు చూపించగా.. ఆమె దానిని చూసి భావోద్వేగానికి లోనైంది. సర్ఫరాజ్‌ ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఆపై తండ్రి నౌషద్ ఖాన్.. సర్ఫరాజ్‌ను కౌగిలించుకుని ఎమోషనల్ అయ్యాడు. తన కొడుకు ఈ స్థాయికి చేరడం వెనుక కష్టాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ భావోద్వేగపూరిత సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

మహారాష్ట్రలో 1997లో జన్మించిన సర్ఫరాజ్‌ ఖాన్‌.. క్రికెటర్‌గా ఎదగడంలో అతడి తండ్రి నౌషద్‌ ఖాన్‌ది కీలక పాత్ర. చిన్నప్పటినుంచి అతడికి అన్ని విధాలుగా అండగా నిలిచాడు. గత మూడేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. సెంచరీల మోత మోగిస్తున్న అతడు ఇప్పటికే టీమిండియాలో చోటు దక్కించుకుని ఉండాలి. అయితే ఫిట్‌నెస్‌, ఇతర కారణాలతో అతడిని బీసీసీఐ సెలక్టర్లు పక్కనపెట్టారు. ఎట్టకేలకు భారత్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఆడిన విషయం తెలిసిందే.