Leading News Portal in Telugu

Sarfaraz Khan: అరుదైన రికార్డు నెలకొల్పిన సర్ఫరాజ్ ఖాన్.. సచిన్ టెండూల్కర్ తర్వాత..!


Sarfaraz Khan: అరుదైన రికార్డు నెలకొల్పిన సర్ఫరాజ్ ఖాన్.. సచిన్ టెండూల్కర్ తర్వాత..!

Sarfaraz Khan surpasses Shubman Gill: దేశవాళీ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తుది జట్టులో సర్ఫరాజ్ చోటు దక్కించుకున్నాడు. టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేతుల మీదగా అతడు టెస్టు క్యాప్‌ను అందుకున్నాడు. దాంతో సర్ఫరాజ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున అరంగేట్రం చేసే సమయానికి.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక బ్యాటింగ్ సగటు ఉన్న ఆరో భారత బ్యాటర్‌గా నిలిచాడు.


భారత్ తరఫున అరంగేట్రం చేసే సమయానికి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వినోద్ కాంబ్లీ అత్యధిక బ్యాటింగ్ సగటును కలిగి ఉన్నాడు. కాంబ్లీ జాతీయ జట్టులోకి అడుగుపెట్టే ముందు 27 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 88.37 సగటుతో పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ 45 మ్యాచ్‌ల్లో 69.85 సగటుతో రన్స్ చేశాడు. ఈ క్రమంలో శుబ్‌మన్‌ గిల్‌ను అధిగమించి.. సచిన్‌ టెండుల్కర్‌ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటివరకు 45 మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్‌.. 3,912 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 11 అర్ధ శతకాలు ఉన్నాయి.

రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ ఇంకా బ్యాటింగ్‌కు రాలేదు. సర్ఫరాజ్ అయిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాల్సి ఉంది. 33 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒత్తిడిలో సర్ఫరాజ్‌ను బ్యాటింగ్‌కు పంపొద్దని భావించిన టీమ్ మేనేజ్మెంట్.. రవీంద్ర జడేజాను ఆ స్థానంలో దించింది. ఇది భారత జట్టుకు కలిసొచ్చింది. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా కలిసి ఇప్పటివరకు 75 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక బ్యాటింగ్‌ సగటు ఉన్న బ్యాటర్లు:
వినోద్ కాంబ్లీ – 88.37 (27 మ్యాచ్‌లు)
ప్రవీణ్ ఆమ్రే – 81.23 (23 మ్యాచ్‌లు)
యశస్వి జైస్వాల్ – 80.21 (15 మ్యాచ్‌లు)
రుషి మోదీ – 71.28 (38 మ్యాచ్‌లు)
సచిన్ టెండుల్కర్ – 70.18 (9 మ్యాచ్‌లు)
సర్ఫరాజ్ ఖాన్ – 69.85 (45 మ్యాచ్‌లు)
శుబ్‌మన్‌ గిల్ – 68.78 (23 మ్యాచ్‌లు)