
India Lost Yashasvi Jaiswal, Shubman Gill and Rajat Patidar: ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే వరుస షాక్‌లు తగిలాయి. 33 పరుగులకే రోహిత్ సేన మూడు వికెట్స్ కోల్పోయింది. యశస్వి జైస్వాల్ (10), శుభ్‌మన్ గిల్ (0), రజత్ పటీదార్ (5) పెవిలియన్ చేరారు. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్స్ కోల్పోయిన టీమిండియా.. పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండు లైఫ్‌లు లభించిన రోహిత్ శర్మ (43).. రవీంద్ర జడేజా (11)తో కలిసి ఆచితూచి ఆడుతున్నాడు. 19 ఓవర్లలో భారత్ మూడు వికెట్ల నష్టానికి 71 రన్స్ చేసింది.
ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్ది సేపటికే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 3.5 ఓవర్ వద్ద మార్క్ వుడ్ బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న జో రూట్‌కు యశస్వి జైస్వాల్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. కాసేపటికే శుభ్‌మన్ గిల్ డకౌట్‌గా వెనుతిరిగాడు. మార్క్ వుడ్ వేసిన 6వ ఓవర్ నాలుగో బంతి గిల్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. ఇక 9వ ఓవర్ ఐదవ బంతికి టామ్ హార్ట్‌లీ బౌలింగ్‌లో కవర్స్‌లో ఉన్న బెన్ డకెట్‌కు సులువైన క్యాచ్ ఇచ్చి రజత్ పటీదార్ పెవిలియన్ చేరాడు.
భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఆచితూచి ఆడుతున్నాడు. రోహిత్‌కు రెండు లైఫ్‌లు దక్కాయి. 13వ ఓవర్ చివరి బంతికి రోహిత్ ఇచ్చిన క్యాచ్‌ను ఫస్ట్ స్లిప్‌లో జో రూట్ వదిలేశాడు. ఆపై 14వ ఓవర్ మూడో బంతికి ఎంపైర్ ఎల్బీగా ఔటివ్వగా.. రివ్యూలో నాటౌట్ అని తేలింది. రెండు లైఫ్‌లు లభించిన రోహిత్ పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతడికి జడేజా సహకారం అందిస్తున్నాడు.