Leading News Portal in Telugu

Sarfaraz Khan: నా తప్పే.. సారీ సర్ఫరాజ్‌: జడేజా


Sarfaraz Khan: నా తప్పే.. సారీ సర్ఫరాజ్‌: జడేజా

Ravindra Jadeja React on Sarfaraz Khan Run-Out: రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆటముగిసే సరికి భారత్‌ 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. అయితే జట్టు స్కోరు 314 పరుగులు ఉన్నప్పుడు ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (99), అరంగేట్ర ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ (62) క్రీజులో ఉన్నారు. జేమ్స్ ఆండర్సన్ బంతిని సాధించగా స్ట్రైకింగ్‌లో ఉన్న జడేజా షాట్‌ ఆడి.. సర్ఫరాజ్‌ను పరుగు కోసం పిలిచాడు. మార్క్ వుడ్ బంతిని అందుకోవడంతో.. వెంటనే జడేజా వెనక్కి వెళ్లాడు. అప్పటికే సగం పిచ్‌ దాటేసిన సర్ఫరాజ్‌.. తిరిగి క్రీజులోకి వచ్చే లోపే వుడ్‌ వికెట్లను గిరాటేశాడు. దీంతో సర్ఫరాజ్‌ రనౌట్‌గా పెవిలియన్ చేరాల్సి వచ్చింది.


టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ను రనౌట్‌ చేసినందుకు అభిమానులు రవీంద్ర జడేజాపై సోషల్‌ మీడియాలో విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తొలిరోజు ఆట ముగిశాక జడేజా స్పందించాడు. సర్ఫరాజ్‌కు క్షమాపణలు చెప్పాడు. ‘చాలా బాధపడుతున్నా. నా తప్పు వల్లే సర్ఫరాజ్‌ ఖాన్ ఔటయ్యాడు. అయినా చాలా బాగా ఆడాడు’ అంటూ జడేజా ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌.. తొలి మ్యాచ్‌లోనే అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వన్డే మ్యాచ్‌లా ఆడి 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రనౌట్‌ అవగానే డ్రెస్సింగ్‌ రూమ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కోపంతో తన తల మీద ఉన్న క్యాప్‌ను నేలకేసి కొట్టాడు.