Leading News Portal in Telugu

Hyderabad Women Cricketers: మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన.. మద్యం సేవిస్తూ..!


Hyderabad Women Cricketers: మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన.. మద్యం సేవిస్తూ..!

Hyderabad Coach misbehaves with Women Cricketers: హైదరాబాద్‌ మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్యంగా ప్రవర్తించిన తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళా క్రికెటర్లను బస్సులో తీసుకెళ్తూ కోచ్ మద్యం తాగాడు. అంతేకాకుండా మద్యం సేవిస్తూనే.. మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్థించాడు. ఇంత జరుగుతున్నా అడ్డుచెప్పకుండా.. ఆ కోచ్‌కు ఓ మహిళా సిబ్బంది మద్దతుగా నిలిచింది. ఈ ఘటనపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేసినా.. ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.


వివరాల ప్రకారం… తాజాగా విజయవాడలో మ్యాచ్ ఆడేందుకు హైదరాబాద్ మహిళా క్రికెటర్లు తమ కోచ్ జైసింహాతో కలిసి వెళ్లారు. మ్యాచ్ అనంతరం తిరుగు ప్రయాణంలో ఫ్లైట్‌కి రావాల్సి ఉండగా.. కావాలనే కోచ్ జైసింహా లేటు చేశాడు. ఫ్లైట్ మిస్ అవడంతో.. విమెన్స్ టీమ్ బస్సులో హైదరాబాద్‌కి బయల్దేరింది. బస్సులో మహిళా క్రికెటర్ల ముందే జైసింహా మద్యం సేవించడంతో.. విమెన్స్ టీమ్ ఆడుచెప్పింది. దాంతో ఆవేశానికి గురైన అతడు బండ బూతులు తిట్టాడు. బస్సులోనే ఉన్న సెలెక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమ రావు.. జైసింహాకు మద్దతుగా నిలిచింది.

కోచ్ జైసింహా తీరుపై నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కి మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. పూర్ణిమ రావు, జైసింహాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసిన కోచ్.. టీమ్ నుంచి తప్పిస్తామని క్రికెటర్లను బెదిరించాడు. అయినా వారు వెనక్కి తగ్గలేదు. ఫిర్యాదు చేసి నాలుగు రోజులు అయినప్పటికీ హెచ్‌సీఏ చర్యలు తీసుకోకపోవడంతో మహిళా క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై హెచ్‌సీఏ పెద్దలు ఇప్పటివరకు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.