Leading News Portal in Telugu

Ranji Trophy 2024: 4 పరుగుల తేడాతో పరాజయం.. టోర్నీ నుంచి ఆంధ్ర జట్టు ఔట్!



Ranji Trophy Andhra

Madhya Pradesh beat Andhra in Ranji Trophy 2024 Quarter Final: రంజీ ట్రోఫీ 2023-24లో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఓటమిపాలైంది. చివరి వరకు పోరాడిన రికీ భుయ్‌ బృందం.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో పరాజయం చెందింది. 170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర 165 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఓటమితో రంజీ ట్రోఫీ 2023-24లో ఆంధ్ర జట్టు ప్రయాణం ముగిసింది.

శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్‌ ఓడిన ఆంధ్ర జట్టు ముందుగా బౌలింగ్‌ చేసి.. తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్‌ను 234 పరుగులకు ఆలౌట్‌ చేసింది. యష్ దూబే (64) టాప్ స్కోరర్. ఆంధ్ర బౌలర్లు కేవీ శశికాంత్‌ నాలుగు, నితీశ్‌ రెడ్డి మూడు వికెట్స్ పడగొట్టారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆంధ్ర 172 పరుగులకే ఆలౌట్ అయింది. రికీ భుయ్‌ 32, కరణ్‌ షిండే 38 ఫర్వాలేదనిపించారు. స్టార్ ప్లేయర్ హనుమ విహారి (14) నిరాశపరిచాడు. ఎంపీ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తికేయ తలో మూడు వికెట్స్ పడగొట్టారు.

Also Read: IND vs ENG 4th Test: గెలుపు వాకిట‌ త‌డ‌బ‌డుతున్న టీమిండియా.. విజయానికి ఎంత కావాలంటే?

62 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్‌ 107 ఆలౌట్‌ అయింది. హిమాన్షు మంత్రి (43) ఒక్కడే పోరాడాడు. నితీశ్‌ రెడ్డి 4 వికెట్స్ తీశాడు. 170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. అప్పటికి విజయం ఆంధ్ర వైపే ఉంది. ఈరోజు హనుమ విహారి (43), కరణ్‌ షిండే (5) త్వరగా అవుటయ్యారు. అశ్విన్‌ హెబ్బర్‌ (22) పోరాడినా.. మిగతా వాళ్ల నుంచి సహకారం కరువైంది. గిరినాథ్‌ రెడ్డి (15) పోరాడినా తృటిలో విజయం చేజారింది. ఈ విజయంతో మధ్యప్రదేశ్‌ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.