Leading News Portal in Telugu

RCB vs MI: 4 పరుగులు ఇచ్చి ఓ వికెట్.. ఆర్‌సీబీ గేమ్ ఛేంజర్ శ్రేయాంక పాటిల్!



Shreyanka Patil

WPL 2024 RCB v MI Turning Point: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2024లో రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫైనల్‌కు వెళ్ళింది. శుక్రవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో గెలిచిన ఆర్‌సీబీ.. మొదటిసారి డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 5 పరుగుల తేడాతో గట్టెక్కింది. ఈ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ 18వ ఓవర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్‌సీబీ బౌలర్ శ్రేయాంక పాటిల్ అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను ఆర్‌సీబీ వైపు తిప్పింది.

స్వల్ప ఛేదనలో హేలీ (15), యాస్తిక (19), సీవర్‌ (23)ల వికెట్లను కోల్పయిన ముంబై.. 10.4 ఓవర్లలో 68/3తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో హర్మన్‌ప్రీత్‌ (33; 30 బంతుల్లో 4×4), అమేలియా (27 నాటౌట్‌)తో కలిసి స్కోరు పెంచింది. వీలుచిక్కినప్పుడల్లా షాట్లు ఆడిన హర్మన్‌.. రన్ రేట్ పడిపోకుండా చూసింది. పెర్రీ వేసిన 16వ ఓవర్లో హర్మన్‌ రెండు బౌండరీలు బాదడంతో.. ముంబై విజయ సమీకరణం 24 బంతుల్లో 32గా మారింది. తర్వాతి ఓవర్లో అమేలియా రెండు ఫోర్లు బాదడంతో ముంబైకి 18 బంతుల్లో 20 రన్స్ అవసరం అయ్యాయి.

క్రీజులో హర్మన్‌ప్రీత్‌, అమేలియా ఉండడంతో ముంబై విజయం లాంఛనమే అనుకున్నారు అందరూ. ఇక్కడే శ్రేయాంక పాటిల్ మ్యాజిక్ చేసింది. మొదటి ఐదు బంతులకు 4 పరుగులు ఇచ్చిన శ్రేయాంక.. చివరి బంతికి హర్మన్‌ప్రీత్‌ను అవుట్ చేసింది. హర్మన్‌ప్రీత్‌ భారీ షాట్ ఆడగా.. లాంగ్ ఆన్‌లో డివైన్ అద్భుత క్యాచ్ పట్టింది. దాంతో హర్మన్‌ప్రీత్‌ పెవిలియన్ చేరింది. దాంతో ముంబై విజయ సమీకరణం 12 బంతుల్లో 16 పరుగులుగా మారింది. ఇక్కడే మ్యాచ్ టర్న్ అయింది.

Also Read: IPL 2024: కోహ్లీతో కలిసి బాబర్‌ ఆడితే.. పాక్‌ అభిమానికి హర్భజన్‌ కౌంటర్‌!

19వ ఓవర్‌ వేసిన సోఫీ మోలినెక్స్‌ నాలుగే పరుగులిచ్చి సజన (1) వికెట్‌ను తీసింది. చివరి ఓవర్లో 12 పరుగులు అవసరం కాగా.. లెగ్‌ స్పిన్నర్‌ ఆశ శోభన మాయాజాలం చేయడంతో బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రేయాంక పాటిల్ 4 ఓవర్లలో 16 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ పడగొట్టింది. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రేయాంకపై ప్రశంసల వర్షం కురుస్తోంది.