Leading News Portal in Telugu

IPL 2024-SRH: షాక్‌కు గురయ్యా.. ఎస్‌ఆర్‌హెచ్‌ అలా చేయాల్సింది కాదు!



Srh Logo

R Ashwin React on SRH Captain for IPL 2024: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) కెప్టెన్‌ మార్పు నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని టీమిండియా సీనియర్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఈస్టర్న్ కేప్ సన్‌రైజర్స్‌ను రెండుసార్లు చాంపియన్‌గా నిలబెట్టిన ఐడెన్‌ మార్క్రమ్‌ను సారథిగా కొనసాగించాల్సిందని యాష్ అభిప్రాయపడ్డాడు. ప్యాట్ కమిన్స్‌ను కెప్టెన్‌గా ప్రకటించడంతో తుది జట్టులో ఎస్‌ఆర్‌హెచ్‌ ఇబ్బందులు ఎదుర్కొంటుందని అశ్విన్‌ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌ 2024 మార్చి 22న ఆరంభం కానుండగా.. ఎస్‌ఆర్‌హెచ్‌ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఆడనుంది.

ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్సీ మార్పు గురించి ఆర్ అశ్విన్ తన యూట్యూబ్ వీడియోలో మాట్లాడాడు. ‘సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఈస్టర్న్ కేప్ సన్‌రైజర్స్‌ వరుసగా రెండు టైటిళ్లు సాధించింది. రెండు అసాధారణ జట్లతో ఈ ఘనత సాధించింది. అయితే రెండు టైటిల్స్ అందించిన ఐడెన్‌ మార్క్రమ్‌ను కాదని ప్యాట్‌ కమిన్స్‌ను కెప్టెన్‌గా నియమించడం నన్ను షాక్‌కు గురిచేసింది. మార్క్రమ్‌నే కెప్టెన్‌గా కొనసాగిస్తారని అంచనా వేశాను. ఎందుకంటే సౌతాఫ్రికా లీగ్‌లో కెప్టెన్‌గా అత్యద్బుత ప్రదర్శన కనబరిచాడు. కానీ అలా జరగలేదు’ అని అశ్విన్ పేర్కొన్నాడు.

Also Read: KL Rahul-IPL 2024: ఐపీఎల్ 2024కు ముందు.. కేఎల్‌ రాహుల్‌ ప్రత్యేక పూజలు!

‘ప్యాట్‌ కమ్మిన్స్‌ను జట్టులోకి తీసుకోవడంతో ప్లేయింగ్ 11ను ఎంపిక చేయడం క్లిష్టంగా మారవచ్చు. ట్రవిస్‌ హెడ్‌ను బ్యాకప్‌గా ఉంచి.. ఐడెన్‌ మార్క్రమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, వనిందు హసరంగలను ఆడించాల్సి ఉంటుంది. కొన్ని వేదికలలో హసరంగా అవసరం లేకుంటే.. ఫజల్‌హాక్ ఫరూఖీ లేదా మార్కో జాన్‌సెన్‌ను ఆడించొచ్చు. విదేశీ ప్లేయర్స్ ఎక్కువగా ఉండడంతో.. తుది జట్టు విషయంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఇబ్బందులను ఎదుర్కోవచ్చు’ అని ఆర్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.