Leading News Portal in Telugu

Neeraj Chopra: భారత్‌కు రాకుండా.. జర్మనీ వెళ్లిన నీరజ్‌ చోప్రా! కారణం ఏంటంటే?


  • ఒలింపిక్స్‌లో రజత పతకం
  • జర్మనీకి నీరజ్‌ చోప్రా
  • సెప్టెంబర్ 14న డైమండ్‌ లీగ్ ఫైనల్‌
Neeraj Chopra: భారత్‌కు రాకుండా.. జర్మనీ వెళ్లిన నీరజ్‌ చోప్రా! కారణం ఏంటంటే?

Neeraj Chopra to consult a doctor in Germany: భారత స్టార్‌ జావెలిన్ త్రోయర్‌, గోల్డెన్ బాయ్ నీరజ్‌ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌ 2024లో రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్‌ పోటీలు ఆదివారం ముగియగా.. నీరజ్‌ స్వదేశానికి రాకుండా జర్మనీకి వెళ్లాడు. ఈ విషయాన్ని భారత ఒలింపిక్ అసోసియేషన్‌ వర్గాలు ధ్రువీకరించాయి. నీరజ్‌ జర్మనీకి వెళ్లాడని.. కనీసం మరో 45 రోజుల వరకు భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం లేదని అతని కుటుంబీకులు ఒకరు తెలిపారు. తన గాయానికి శస్త్రచికిత్సకు సంబంధించి వైద్య సలహా తీసుకోవడానికి, డైమండ్ లీగ్‌ల్లో పాల్గొనాలా? వద్దా? అని నిర్ణయించుకోవడానికి జర్మనీ వెళ్లినట్లు తెలుస్తోంది.

‘నీరజ్‌ చోప్రా పారిస్ నుంచి జర్మనీ వెళ్లాడు. మరో 45 రోజుల వరకు అతడు భారత్‌కు వచ్చే అవకాశం లేదు. నాకు పూర్తి వివరాలు వివరాలు తెలియదు గానీ.. వైద్యుడిని సంప్రదించడానికి అక్కడికి వెళ్లాడు. నీరజ్ కండిషన్‌ను బట్టి డైమండ్‌ లీగ్‌ల్లో పాల్గొనాలా? వద్దా అనేది కోచ్, ఫిజియో నిర్ణయిస్తారు’ అని జావెలిన్ త్రోయర్‌ నీరజ్ కుటుంబీకులు ఒకరు తెలిపారు. గతంలో కూడా గాయం గురించి జర్మనీలోని వైద్యుడిని నీరజ్ సంప్రదించాడు. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు కొన్నిరోజులు అక్కడి సార్‌బ్రూకెన్‌లో శిక్షణ పొందాడు. డైమండ్‌ లీగ్ ఫైనల్‌ సెప్టెంబర్ 14న బెల్జియంలోని బ్రసెల్స్‌లో జరగనుంది.