Leading News Portal in Telugu

ICC Chairman: ఐసీసీ ఛైర్మన్‌ ఎన్నికపై ఉత్కంఠ.. అందరి కళ్లు జై షా పైనే!


  • నవంబరుతో బార్‌క్లే పదవీకాలం పూర్తి
  • మూడోసారి బరిలో నిలవని బార్‌క్లే
  • ఆగష్టు 27 నామినేషన్లకు చివరి రోజు
ICC Chairman: ఐసీసీ ఛైర్మన్‌ ఎన్నికపై ఉత్కంఠ.. అందరి కళ్లు జై షా పైనే!

BCCI secretary Jay Shah Eye on ICC Chairman Post: ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్‌క్లే పదవీకాలం వచ్చే నవంబరు 30తో ముగుస్తుంది. మూడోసారి ఛైర్మన్‌ ఎన్నికల బరిలో నిలవకూడదని అతడు నిర్ణయించుకున్నారు. దాంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా.. ఐసీసీ ఛైర్మన్‌ పదవి కోసం పోటీ పడొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే జై షా పోటీ చేస్తాడా? లేదా అన్నది ఆగష్టు 27న తెలుస్తుంది. ఎందుకంటే ఐసీసీ ఛైర్మన్‌ పదవి కోసం నామినేషన్ల దాఖలుకు అది చివరి రోజు.

ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఏ బోర్డుకు చెందిన ఎవరైనా పర్యాయానికి రెండేళ్ల చొప్పున ఐసీసీ ఛైర్మన్‌గా మూడు పర్యాయాలు ఉండొచ్చు. న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్‌ బార్‌క్లే రెండు పర్యాయాలు (నాలుగేళ్లు) పూర్తి చేశాడు. మూడోసారి ఛైర్మన్‌ పదవికి పోటీపడే అవకాశం అతడికి ఉంది. కానీ మూడోసారి ఛైర్మన్‌ పదవికి తాను పోటీపడనని బార్‌క్లే స్వయంగా ధ్రువీకరించారు. నవంబరులో అతడి పదవీకాలం పూర్తవుతుంది. బార్‌క్లే 2020 నవంబరులో మొదటిసారి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2022లో మరోసారి ఎన్నికయ్యారు.

ఐసీసీ ఛైర్మన్‌ ఎన్నికల్లో మొత్తం 16 ఓట్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. 9 ఓట్లు లభించిన వ్యక్తి ఛైర్మన్‌ అవుతాడు. జై షా ప్రస్తుతం ఐసీసీ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల ఉపసంఘం అధిపతి. ఓటు హక్కు ఉన్న చాలా క్రికెట్ దేశాలు షాకు మద్దతుగా ఉన్నాయి. దాంతో బీసీసీఐ షా.. ఐసీసీ ఛైర్మన్‌ అవ్వడం పక్కా అని తెలుస్తోంది. ఇక బీసీసీఐ కార్యదర్శిగా షాకు మరో ఏడాది పదవీకాలం ఉంది. అనంతరం మూడేళ్ల తప్పనిసరి విరామం తీసుకోవాలి. బీసీసీఐలో ఎలాంటి పదవుల్లో అతడు ఉండకూడదు. ఈ విరామంలో ఐసీసీల కొనసాగే అవకాశం ఉంది.