Leading News Portal in Telugu

PAK vs BAN: బాధ పడటం లేదు.. ఆ విషయం రిజ్వాన్‌కు ముందే తెలుసు!


  • 448-6 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్‌
  • సారథి అడ్డుపడ్డాడని విమర్శలు
  • రిజ్వాన్‌ స్వయంగా సూచనలు చేశాడు
PAK vs BAN: బాధ పడటం లేదు.. ఆ విషయం రిజ్వాన్‌కు ముందే తెలుసు!

Saud Shakeel on Mohammad Rizwan: రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజున పాక్ వికెట్‌ కీపర్ మహ్మద్‌ రిజ్వాన్ (171 నాటౌట్) భారీ సెంచరీ చేశాడు. 239 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సులతో 171 రన్స్ చేశాడు. రిజ్వాన్ మరో 29 పరుగులు చేస్తే డబుల్‌ సెంచరీ పూర్తయ్యేది. కానీ పాక్ కెప్టెన్ షాన్‌ మసూద్ 448-6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేశాడు. దీంతో రిజ్వాన్‌ డబుల్ సెంచరీ చేయకుండా సారథి అడ్డుపడ్డాడని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.

ఈ విమర్శలపై పాకిస్థాన్ క్రికెటర్ సౌద్ షకీల్ స్పందించాడు. ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసేందుకు గంట ముందే 450 స్కోరు దగ్గరగా చేయాలని మహ్మద్‌ రిజ్వాన్‌ కూడా సలహా ఇచ్చినట్లు చెప్పాడు. ‘రిజ్వాన్‌ డబుల్‌ సెంచరీ మిస్‌ అయిందనే బాధ మాకు లేదు. రిజ్వాన్ దాని గురించే ఆలోచించలేదు. ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్‌ నిర్ణయంలో ఎలాంటి తొందరపాటు లేదు. ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసే గంట ముందే రిజ్వాన్‌ స్వయంగా సూచనలు చేశాడు. 450 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేద్దామనుకున్నాం. ఆ సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందో రిజ్వాన్‌కు తెలుసు’ అని షకీల్ చెప్పాడు.

రెడ్-బాల్ క్రికెట్‌లో తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్న సౌద్ షకీల్ ఈ టెస్టులో 261 బంతుల్లో 141 పరుగులు చేశాడు. పాక్ స్కోర్ 114/4 ఉన్నపుడు షకీల్, రిజ్వాన్‌ కలిసి జట్టును ఆదుకున్నారు. ఐదవ వికెట్‌కు 240 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో పాక్ భారీ స్కోర్ చేసింది. రెండోరోజు ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌ను 448/6 వద్ద డిక్లేర్‌ చేసింది. అభిమానులు మాత్రం రిజ్వాన్‌ డబుల్ సెంచరీ చేస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.