- వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో శ్రీలంక రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్
-
6 రోజులు ఆడనున్న మొదటి టెస్ట్ -
ఈ మ్యాచ్ సమయంలో అధ్యక్ష ఎన్నికలు.

వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ షెడ్యూల్‌ను శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. శ్రీలంక క్రికెట్ ప్రకటించిన షెడ్యూల్లో మొదటి టెస్ట్ 6 రోజుల్లో ఆడనున్నట్లు ఉంది. సాధారణంగా ఒక టెస్ట్ మ్యాచ్ ఐదు రోజుల పాటు జరుగుతుంది. కానీ.. ఈ టెస్ట్ మ్యాచ్ ఆరు రోజులు జరగనుంది. అందుకు కారణమేంటంటే.. గాలెలో జరగనున్న ఈ టెస్ట్ మ్యాచ్ సమయంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో (సెప్టెంబర్ 21న) ఒక రోజు ఆట జరగదు.
కాగా.. సెప్టెంబరు 18 నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. గత రెండు దశాబ్దాల్లో శ్రీలంక 6 రోజుల టెస్టు మ్యాచ్ ఆడడం ఇదే తొలిసారి. చివరిసారిగా 2001లో కొలంబోలో జింబాబ్వేపై జరిగింది. పౌర్ణమి సందర్భంగా శ్రీలంకలో జరుపుకునే సాంప్రదాయ సెలవుదినమైన పోయా డే రోజు కూడా మ్యాచ్ జరగలేదు. గత శతాబ్దంలో టెస్ట్ క్రికెట్లో విశ్రాంతి దినాలు ఒక సాధారణ అభ్యాసం.. ఇంగ్లండ్‌లో చాలా మ్యాచ్‌లు ఆరు రోజుల పాటు ఆడారు. కొన్నిసార్లు ఆదివారం ఆడని సందర్భాలు కూడా ఉన్నాయి. టెస్టు క్రికెట్లో చివరిసారిగా 2008లో బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో విశ్రాంతి దినాన్ని ప్రకటించారు. పార్లమెంటరీ ఎన్నికల కారణంగా శ్రీలంకతో సిరీస్‌లో ప్రారంభ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ డిసెంబర్ 29న విశ్రాంతి దినాన్ని చేర్చుకుంది.
ప్రస్తుతం జరుగుతున్న ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో శ్రీలంక, న్యూజిలాండ్ రెండూ బలమైన పోటీదారులుగా ఉన్నాయి. ప్రస్తుతం జట్లు పాయింట్ల పట్టికలో మూడు, నాల్గవ స్థానాల్లో ఉన్నాయి.