Leading News Portal in Telugu

IPL 2025: రోహిత్‌ శర్మ చాలా కాస్ట్‌లీ గురూ.. అతడిని కొనడం మా వల్ల కాదు!


  • ఐపీఎల్ 2025 వేలంలోకి రోహిత్
  • హిట్‌మ్యాన్‌ను కొనుగోలు చేసేందుకు తీవ్ర పోటీ
  • రికార్డులు పక్కా
IPL 2025: రోహిత్‌ శర్మ చాలా కాస్ట్‌లీ గురూ.. అతడిని కొనడం మా వల్ల కాదు!

Sanjay Bangar on Rohit Sharma’s IPL 2025 Price; ముంబై ఇండియన్స్‌కు ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మను ఐపీఎల్‌ 2024 సీజన్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. గతేడాది హార్దిక్ పాండ్యా సారథ్యంలో హిట్‌మ్యాన్ ఆడాడు. కెప్టెన్సీ నుంచి తొలగించడంతో అసంతృప్తిగా ఉన్న రోహిత్.. ఐపీఎల్ 2025 ముందు వేరే ఫ్రాంచైజీకి వెళ్లిపోతాడనే కథనాలు సోషల్ మీడియాలో వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌ జట్లు హిట్‌మ్యాన్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని నెట్టింట న్యూస్ చక్కర్లు కొట్టాయి. తాజాగా మరో వార్త హల్‌చల్‌ చేస్తోంది.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో రోహిత్ శర్మ తన పేరును నమోదు చేసుకుంటాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పంజాబ్ కింగ్స్‌ డైరెక్టర్ సంజయ్ బంగర్ స్పందించారు. రోహిత్‌ను పంజాబ్‌ దక్కించుకుంటుందా? అని ఓ పాడ్‌కాస్టర్ అడగగా.. రోహిత్‌ చాలా కాస్ట్‌లీ గురూ, అతడిని కొనడం తమ వల్ల కాదని చెప్పకనే చెప్పారు. రోహిత్‌ మెగా వేలంలోకి వస్తే రికార్డులు సృష్టిస్తాడని, అత్యధిక ధరను సొంతం చేసుకుంటాడన్నారు. ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా మిచెల్‌ స్టార్క్‌ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. గతేడాది జరిగిన మినీ వేలంలో ఈ ఆస్ట్రేలియా ఆటగాడిని కేకేఆర్‌ ఏకంగా రూ.24.75కోట్లు పెట్టి దక్కించుకుంది.

పంజాబ్ కింగ్స్‌ డైరెక్టర్ సంజయ్ బంగర్ మాట్లాడుతూ… ‘రోహిత్‌ శర్మ ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి వస్తే రికార్డులు సృష్టిస్తాడు. అత్యధిక ధరను అతడు సొంతం చేసుకుంటాడు. హిట్‌మ్యాన్ కోసం ప్రాంఛైజీలు ఎగబడడం ఖాయం అని అనుకుంటున్నా. అయితే మా పర్సులో సొమ్మును బట్టే రోహిత్‌ను పంజాబ్‌ కింగ్స్ దక్కించుకుంటుందా? లేదా? అనేది ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి హిట్‌మ్యాన్‌ను సొంతం చేసుకోవడం మాకు చాలా కష్టం’ అని అన్నారు.