- 7 మ్యాచ్‌ల్లోనే 24 వికెట్లు
- షమీ ఫన్నీ కామెంట్స్
- ఆ ఆలోచన మేనేజ్‌మెంట్‌కు రాకుండా చేశా

Mohammed Shami About ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో భారత జట్టు ఫైనల్‌కు చేరడంలో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 7 మ్యాచ్‌ల్లోనే 24 వికెట్లు పడగొట్టి.. మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన వీరుడిగా నిలిచాడు. అయితే టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో షమీకి తుది జట్టులో అవకాశం దక్కలేదు. హార్దిక్ పాండ్యా గాయపడిన తర్వాత ఛాన్స్ వచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. తానెంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. ఇటీవల ఓ క్రికెట్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న షమీ.. ఆరంభ మ్యాచ్‌ల్లో తుది జట్టులో చోటు దక్కకపోవడంపై ఫన్నీ కామెంట్స్ చేశాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో తుది జట్టు నుంచి తప్పించినప్పుడు ఎలా ఫీలయ్యారు అనే ప్రశ్న మహ్మద్ షమీకి ఎదురైంది. ‘2023లో కాదు 2015, 2019 ప్రపంచకప్‌లోనూ ఇలానే జరిగింది. నాకు అవకాశం రాగానే మంచి ప్రదర్శన చేసి.. మరోసారి నన్ను తుది జట్టు నుంచి తప్పించాలనే ఆలోచన టీమ్ మేనేజ్‌మెంట్‌కు రాకుండా చేశా. కష్టపడితే ఫలితం అదే వస్తుంది. తుది జట్టులో ఛాన్స్ దక్కకపోతే బెంచ్‌కు పరిమితమై.. మైదానంలోని ఆటగాళ్లకు నీళ్లు మాత్రమే ఇవ్వగలను. అందుకే అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి’ అని షమీ చెప్పుకొచ్చాడు.
వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న మహ్మద్ షమీ.. కొన్ని నెలలుగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం కోలుకున్న అతడు బీసీసీఐ వైద్యుల సమక్షంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో పునరాగమనం చేయాలని చూస్తున్నాడు. జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతిని ఇవ్వనున్న నేపథ్యంలో షమీ కీలకంగా మారనున్నాడు.