Leading News Portal in Telugu

Rohit Sharma: జిమ్‌లో తొలిసారి కసరత్తులు.. రోహిత్‌ శర్మ పిక్స్ వైరల్!


  • కెరీర్ ఆరంభంలో తీవ్ర ఇబ్బందులు
  • ఫిట్‌నెస్‌ విషయంలో ట్రోల్స్
  • జిమ్‌లో తెగ శ్రమిస్తున్న రోహిత్‌
Rohit Sharma: జిమ్‌లో తొలిసారి కసరత్తులు.. రోహిత్‌ శర్మ పిక్స్ వైరల్!

Rohit Sharma at MCA Gym: టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌ విషయంలో తరచూ ట్రోల్‌ అవుతుంటాడు. హిట్‌మ్యాన్‌ బరువును ఉద్దేశించి.. పావ్‌‌బాజీ, సాంబార్ వడ అంటూ నెటిజెన్స్ జోకులు పేల్చుతుంటారు. చాలా సందర్భాల్లో ఫిట్‌నెస్‌పై ఇబ్బందికరమైన ప్రశ్నలను కూడా ఎదుర్కొన్నాడు. దాంతో చాలా కాలంగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో జిమ్‌లో తెగ శ్రమిస్తున్నాడు. దులీప్‌ ట్రోఫీ 2024కి దూరంగా ఉన్న హిట్‌మ్యాన్‌.. ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంసీఏ)లో ఆధునికీకరించిన జిమ్‌లో ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నాడు.

ఆధునికీకరించిన జిమ్‌లో తొలిసారి కసరత్తులు చేసిన వ్యక్తి రోహిత్‌ శర్మనే అని ఎంసీఏ పేర్కొంది. ‘ఆధునికీకరించిన మా జిమ్‌లో తొలిసారి కసరత్తులు చేస్తున్న వ్యక్తి రోహిత్‌ శర్మ. మాకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. హిట్‌మ్యాన్‌ మార్గదర్శకత్వంలో ఫిట్‌నెస్‌ సరికొత్తశకం ప్రారంభం కానుంది’ అని ఎంసీఏ రాసుకొచ్చింది. ఈ పోస్టుకు రోహిత్‌ కసరత్తులు చేస్తున్న ఫొటోలను జత చేసింది. రోహిత్‌ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నెల 19న ఆరంభం అయ్యే బంగ్లాదేశ్‌ టెస్ట్‌ సిరీస్‌ కోసం రోహిత్ సన్నద్ధమవుతున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో రోహిత్‌ రాణించాడు.

సరైన ఫిట్‌నెస్‌ లేక రోహిత్ శర్మ కెరీర్ ఆరంభంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అతడి పొట్టను ఉద్దేశించి బాడీ షేమింగ్ కామెంట్స్ చేసేవారు. 2007 టీ20 ప్రపంచకప్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్.. అధిక బరువు, ఫామ్ లేమితో 2011 వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఫిట్‌నెస్‌పై దృషి పెట్టడమే కాకుండా.. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించి మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అతడికి ఓపెనర్‌గా అవకాశం ఇవ్వడంతో తనలోని హిట్‌మ్యాన్‌ను పరిచయం చేశాడు. అనంతరం జట్టులో పాతుకుపోయిన రోహిత్.. కెప్టెన్‌గా ఎదిగాడు. భారత జట్టుకు ఐసీసీ ట్రోఫీ కూడా అందించాడు.