Leading News Portal in Telugu

IND vs BAN: సర్ఫరాజ్‌ ఖాన్‌‌కు.. స్టార్‌ బ్యాటర్‌కు ఛాన్స్‌?


  • 19 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం
  • వికెట్‌ కీపర్‌గా రిషబ్ పంత్‌
  • రాహుల్-సర్ఫరాజ్‌ మధ్య తీవ్ర పోటీ
IND vs BAN: సర్ఫరాజ్‌ ఖాన్‌‌కు.. స్టార్‌ బ్యాటర్‌కు ఛాన్స్‌?

KL Rahul vs Sarfaraz Khan for IND vs BAN 1st Test: సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్‌ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు కోసం 16 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ఆదివారం ప్రకటించారు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రాణించిన దేశవాళీ సెన్సేషన్ సర్ఫరాజ్‌ ఖాన్‌కు జట్టులో చోటు దక్కింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వికెట్‌ కీపర్‌ రిషబ్ పంత్‌, బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా తొలి టెస్టుకు ఎంపికయ్యారు. దాంతో తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

వికెట్‌ కీపర్‌గా రిషబ్ పంత్‌ ఆడడం ఖాయం. దాంతో ధ్రువ్‌ జురెల్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఇక మిడిల్ ఆర్డర్‌లో కేఎల్ రాహుల్, సర్ఫరాజ్‌ ఖాన్‌ మధ్య తీవ్ర పోటీ ఉంది. రాహుల్‌పైనే టీమ్‌ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్-గవాస్కర్‌ ట్రోఫీ ఉంది. ఈ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని సీనియర్ రాహుల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని మేనేజ్‌మెంట్ భావిస్తోందట. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్‌లు ఆడడం కూడా రాహుల్‌కు కలిసొచ్చే అంశం. అంతేకాదు పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ (డిఫెన్స్ లేదా హిట్టింగ్) కూడా చేయగలడు.

‘కేఎల్ రాహుల్ చివరి మూడు మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ (దక్షిణాఫ్రికాపై) చేశాడు. ఇటీవలి కాలంలో అత్యుత్తమ టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఇది ఒకటి. హైదరాబాద్‌ టెస్టులో 86 పరుగులు చేశాడు. రాహుల్ గాయపడి టీమ్‌లో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం అతడు ఫిట్‌గా ఉన్నాడు. దులీప్‌ ట్రోఫీ 2024తో మంచి ప్రాక్టీస్ లభించింది. రాహుల్ తుది జట్టులో ఉంటాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా.. టీమ్ మేనేజ్‌మెంట్ రాహుల్ వైపే మొగ్గుచూపుతోంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ కోసమే కాకుండా.. ఆస్ట్రేలియా పర్యటనను కూడా దృష్టిలో ఉంచుకుని జట్టును సిద్ధం చేస్తున్నారు. ఎవరైనా గాయపడితే సర్ఫరాజ్‌కు అవకాశం వస్తుంది’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.